ఈసారి రాజశేఖర్‌ను తిట్టలేదు

ఈసారి రాజశేఖర్‌ను తిట్టలేదు

సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. ఇండస్ట్రీలో ఎంతటి వ్యక్తినైనా విమర్శించగలరు. ఒకప్పటి తన మిత్రుడు.. తర్వాత మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవిని సైతం ఆయన వదిలి పెట్టలేదు.

ఇంకా చాలామంది తమ్మారెడ్డి విమర్శలకు గురైన వాళ్లే. ఇక సీనియర్ హీరో రాజశేఖర్ అంటే చాలు తమ్మారెడ్డి ఒంటికాలి మీద లేస్తారు. రాజశేఖర్‌తో ఆయన తీసిన ‘వేటగాడు’ అట్టర్ ఫ్లాపై ఆర్థికంగా బాగా దెబ్బ కొట్టింది. ఈ సినిమా ఫ్లాపవడానికి రాజశేఖరే కారణమని.. అతను షూటింగ్‌లకు సరైన సమయానికి రాకపోవడం, ఇంకా పలు రకాలుగా ఇబ్బంది పెట్టడం వల్లే సినిమా పోయిందని తమ్మారెడ్డి గతంలో రెండు మూడుసార్లు దుయ్యబట్టాడు.

ఐతే ఈ విమర్శలపై మౌనం వహించిన రాజశేఖర్.. ఈ మధ్య ‘గరుడవేగ’ రిలీజైన టైంలో ఒక ఇంటర్వ్యూలో తమ్మారెడ్డిపై ఎదురు దాడి చేశాడు. తమ్మారెడ్డి తనకు పారితోషకం ఎగ్గొట్టడానికి ప్రయత్నించిన వైనాన్ని వివరించాడు. దీంతో తమ్మారెడ్డి సైలెంటయ్యాడు.

తాజాగా తమ్మారెడ్డి పాల్గొన్న ఒక టీవీ కార్యక్రమంలో ‘వేటగాడు’ ప్రస్తావన వచ్చింది. తాను ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి ఈ సినిమానే కారణమంటూ ఆ వివరాలు చెప్పబోయి ఆగిపోయాడు తమ్మారెడ్డి. ఇప్పుడు మళ్లీ ఆ విషయాలు మాట్లాడితే వివాదాస్పదం అవుతుందని.. ఎప్పుడో జరిగిన నష్టం గురించి ఇప్పుడు మళ్లీ చర్చ ఎందుకులే అని సమాధానం దాటవేశాడు తమ్మారెడ్డి. ఆ మధ్య రాజశేఖర్ ఎదురు దాడి చేసిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఆ విషయాన్ని కెలికితే రాజశేఖర్-జీవిత మళ్లీ లైన్లోకి వస్తారేమో అని వెనక్కి తగ్గినట్లున్నాడు తమ్మారెడ్డి.

అసలు రాజశేఖర్ పేరెత్తడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఇక తన కెరీర్లో తాను చేసిన అత్యంత చెత్త సినిమా  ‘ఎంత బాగుందో’ అని చెప్పాడు తమ్మారెడ్డి. ఆ టైటిల్‌కు పూర్తి విరుద్ధంగా సినిమా చాలా చండాలంగా ఉంటుందని తమ్మారెడ్డి అన్నారు. తన శైలికి భిన్నంగా కొత్త జానర్లో ఆ సినిమా చేశానని.. అది దరిద్రంగా వచ్చిందని.. ఆ సినిమా తాను చేసి ఉండాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు