తప్పుకుందా.. తప్పించారా?

తప్పుకుందా.. తప్పించారా?

మంచి మంచి అవకాశాలొస్తే సరిపోదు. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పాపం అను ఇమ్మాన్యుయెల్‌ విషయంలో అలా జరగలేదు. ఇందులో ఆమె ప్రమేయం ఏమీ లేకపోయినా జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. ‘మజ్ను’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి చిన్న సినిమాల్లో నటించిన ఆమెకు ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ లాంటి భారీ చిత్రాల్లో అవకాశం దక్కుతుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఊహించిన రీతిలో ఆమెకు ఛాన్సులొచ్చాయి. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ రెండు సినిమాలూ తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఆ సినిమాలు ఆడకపోగా.. అనుకు ఏమాత్రం గుర్తింపు కూడా తేలేదు. వరుసగా రెండు భారీ సినిమాలు తేడా కొడితే ఇక చెప్పేదేముంది..? కెరీర్ ప్రమాదంలో పడిపోయింది. పై రెండు సినిమాలు చేస్తున్న ఊపులో రెండు సినిమాలకు సంతకం చేస్తే.. అందులో ఒకటి చేజారిపోయింది.

అక్కినేని నాగచైతన్య-మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘శైలజారెడ్డి అల్లుడు’తో పాటు రవితేజ-శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో కూడా అనుకు అవకాశం దక్కింది. కానీ ఇందులో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ నుంచి అమె తప్పుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రం కోసం 50 రోజుల అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేశారట. దానికి పూర్తిగా అందుబాటులో ఉండాలని అనుకు చెప్పగా.. ఆమె డేట్లు సర్దుబాటు చేయలేకపోయింది. దీంతో ఆ ప్రాజెక్టు నుంచి ఆమె బయటికి వచ్చేయాల్సి వచ్చింది. చిత్ర బృందం కంటే ముందు అనునే ఈ విషయాన్ని ప్రకటించింది.

మరి డేట్ల సమస్య మాత్రమేనా.. వరుస డిజాస్టర్లలో ఉన్న అనుతో కలిసి రాదని ఆమెను బయటికి పంపించేశారా అన్నది తెలియాల్సి ఉంది. ‘నా పేరు సూర్య’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లకు అను రాకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి అను చేతిలో ఉన్న ఏకైక తెలుగు సినిమా ‘శైలజా రెడ్డి అల్లుడు’ అయినా ఆమెకు మంచి ఫలితాన్నిస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు