ఆ వేడుకలో విశాల్ రెచ్చిపోయాడు..

ఆ వేడుకలో విశాల్ రెచ్చిపోయాడు..

తెలుగువాడైన తమిళ కథానాయకుడు విశాల్ ఎంతటి ఆవేశపరుడో తెలిసిందే. ఒక నిర్మాత కొడుకుగా తెరంగేట్రం చేసి అంచెలంచెలుగా స్టార్ హీరోగా ఎదిగాడతను. ఏ అంశం మీదైనా విశాల‌్‌కు ఆవేశం వచ్చిందంటే పట్టడం కష్టం. ఆ ఆవేశంతోనే నడిగర్ సంఘం.. నిర్మాతల మండలి ఎన్నికల బరిలో నిలిచాడు. తన సిన్సియారిటీని చాటుకుని విజయం కూడా సాధించాడు. చివరికి రాజకీయ రణరంగంలో అడుగుపెట్టడానికి కూడా సిద్ధమయ్యాడు.

కానీ కొన్ని కారణాల వల్ల అతడికి బ్రేక్ పడింది. ఇక ఇటీవలే కోలీవుడ్లో మునుపెన్నడూ రీతిలో సాగిన సమ్మెను విశాల్ ముందుండి నడిపించాడు. నిర్మాతల డిమాండ్లను చాలా వరకు సాధించాక కానీ పట్టు విడవలేదు. ఈ విషయంలో విశాల్‌పై ప్రశంసల జల్లు కురిసింది. ఐతే విశాల్ అంటే గిట్టక అతడిని విమర్శించే వాళ్లు కూడా లేకపోలేదు.

ఇటీవలే టి.రాజేందర్, భారతీరాజా లాంటి వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి విశాల్‌ మీద విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. విశాల్ నడిగర్ సంఘంలో రూ.7 కోట్ల అవినీతికి పాల్పడ్డాడన్నారు. దీనిపై తన కొత్త సినిమా ‘ఇరుంబు తురై’ సక్సెస్ మీట్లో చాలా ఆవేశంగా స్పందించాడు. తన మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న వాళ్లు ఆధారాలతో రావాలని సవాలు చేశాడు. ఊరికే ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నాడు. ‘ఇరుంబు తురై’ విడుదలను ఆపడానికి చాలామంది కుట్రలు చేశారని.. కానీ విడుదలకు ముందు రోజు రాత్రంతా నిద్ర పోకుండా ఉండి.. ఎందరితోనో మాట్లాడి సినిమా సజావుగా రిలీజయ్యేలా చూశానని అతనన్నాడు.

ఎవరెన్ని కుట్రలు చేసినా.. తనను విమర్శించినా పరిశ్రమకు సంబంధించిన సమస్యల విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. ఈ విషయం తొడగొట్టి చెబుతున్నానని విశాల్ అనడంతో ఆడిటోరియం హోరెత్తిపోయింది. ఇక ‘ఇరుంబు తురై’ గురించి స్పందిస్తూ.. దర్శకుడు మిత్రన్ దీని కంటే ముందు వేరే కథతో వచ్చాడని.. అది బాలేదని పంపించేశానని.. ఇంకో కథ చెబుతానన్నా వినడానికి ఇష్టపడలేదని.. కానీ వదలకుండా ప్రయత్నించి కథ చెప్పాడని.. అది నచ్చి సినిమా చేశానని.. అర్జున్ ఈ సినిమాలోకి రావడంతో ఇది పెద్ద హిట్టవుతుందన్న నమ్మకం ఏర్పడిందని చెప్పాడు. ‘ఇరుంబు తురై’ తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో ఈ నెల 26న విడుదల కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు