రీమేక్ లేదు.. డబ్బింగే

రీమేక్ లేదు.. డబ్బింగే

వేరే భాష నుంచి ఒక సినిమాను తీసుకొచ్చి రీమేక్ చేసి హిట్టు కొట్టాక ఆ భాషలో ఆ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కితే దాని మీద కూడా ఇక్కడి వాళ్ల కన్ను పడుతుంది. ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి ‘మున్నాభాయి ఎంబీబీఎస్’ సినిమాను ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ పేరుతో రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. ఆ తర్వాత ‘మున్నాభాయ్’కి సీక్వెల్ తీస్తే దాన్ని కూడా మళ్లీ రీమేక్ చేశాడు. కానీ సరైన ఫలితం దక్కలేదు. ఇక తమిళంలో ఒకప్పుడు బ్లాక్ బస్టర్ అయిన ‘సామి’ని బాలయ్య హీరోగా ‘లక్ష్మీనరసింహా’ పేరుతో తెలుగులో తీసిన సంగతి తెలిసిందే. అది బాగానే ఆడింది. ఇప్పుడు ‘సామి’కి కొనసాగింపుగా ‘సామి స్క్వేర్’ తీస్తున్నాడు దర్శకుడు హరి. ఇటీవలే దీని మోషన్ పోస్టర్ కూడా లాంచ్ చేశారు.

మరి ఈ చిత్రాన్ని బాలయ్య రీమేక్ చేస్తాడా..  బాలయ్య కాకపోతే ఇంకెవరైనా ఈ రీమేక్ గురించి ఆలోచిస్తారా అన్న చర్చ మొదలైంది. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ‘సామి స్క్వేర్’ను నేరుగా తెలుగులోకి తెచ్చేస్తున్నారు. తమిళంతో పాటే దీని తెలుగు వెర్షన్ కూడా ఒకేసారి విడుదల కాబోతోంది. దీని తెలుగు మోషన్ పోస్టర్ కూడా లాంచ్ చేయబోతున్నారు. కానీ ‘సామి’ అనే సినిమా ఇక్కడ రిలీజ్ కానపుడు.. ‘సామి స్క్వేర్’ అని రిలీజ్ చేస్తే ఎలా జనాలు కనెక్టవుతారో చూడాలి.

కాబట్టి పేరేమైనా మారుస్తారేమో? విక్రమ్.. హరిలతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కాబట్టి ఇక్కడ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. వచ్చే నెలలోనే ‘సామి స్క్వేర్’ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. 2003లో విడుదలైన ‘సామి’ అప్పట్లో ‘నరసింహా’ వసూళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టి కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు