ఇది కూడా దంచుతోందిగా..

ఇది కూడా దంచుతోందిగా..

ఉన్నట్లుండి ఇండియన్ బాక్సాఫీస్‌లో హలీవుడ్ సినిమాల హవా కనిపిస్తోంది. గత నెల విడుదలైన ‘ఎవెంజర్స్.. ఇన్ఫినిటీ వార్’ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఆ చిత్రం అబ్బురపరిచింది. దీని తర్వాత అందరి చూపూ జూన్ 7న రిలీజ్ కాబోయే ‘జురాసిక్ వరల్డ్: ది ఫాలెన్ కింగ్‌డమ్’ మీద ఉంది. ఆ చిత్రం కూడా ‘ఎవెంజర్స్’ తరహాలోనే ఇండియాలో వసూళ్ల మోత మోగిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఐతే మధ్యలో మరో హాలీవుడ్ మూవీ కూడా భారత బాక్సాఫీస్ మీద దండయాత్రకు దిగడం విశేషం. అదే.. డెడ్ పూల్-2. సూపర్ హీరో సినిమా ‘డెడ్ పూల్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీ.. తెలుగు.. తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రం తొలి రోజు అనూహ్య వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ.12 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది.

‘ఎవెంజర్స్’తో పోలిస్తే ‘డెడ్ పూల్-2’ మీద అంచనాలు తక్కువే. ఈ చిత్రం తొలి రోజు రూ.12 కోట్లు వసూలు చేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. మిగతా సూపర్ హీరో సినిమాలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది. ఇందులో కామెడీ టచ్ బాగా ఉంటుంది. ఒరిజినల్ వెర్షనే చాలా ఫన్నీగా సాగుతుంది. ఇక దానికి ప్రాంతీయ భాషల్లో భలే సరదాగా డబ్బింగ్ చేయించారు. తెలుగు వెర్షన్ ట్రైలర్ చూసినపుడే జనాలకు భలే చమత్కారంగా అనిపించింది. ఒక సీన్లో హీరో పాత్రధారి ఇందులో అతడికి రానా డబ్బింగ్ చెప్పలేదులే (ఎవెంజర్స్‌లో విలన్ పాత్రకు రానా వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే) అంటాడు. ఇంకా చాలా చమక్కులే కనిపించాయి ట్రైలర్లో.

ఈ చిత్రం ప్రపంచవ్యవాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. గురువారం ప్రివ్యూలతోనే ‘డెడ్ పూల్-2’ రూ.122 కోట్లు వసూలు చేయడం విశేషం. శుక్రవారంతో కలిపి వసూళ్లు రూ.340 కోట్లకు చేరుకున్నాయి. ఇండియాలో ఈ చిత్రం రూ.100 కోట్ల మార్కును అందుకోగలదని అంచనా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు