‘ఆఫీసర్’ వెనుక అసలు కథ అది

‘ఆఫీసర్’ వెనుక అసలు కథ అది

నిజ జీవితంలో తనకు ఎదురైన అనుభవాల ఆధారంగా కథలు.. పాత్రల్ని తీర్చిదిద్దే దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకడు. అలా స్ఫూర్తి పొంది వర్మ తీసిన కొన్ని సినిమాలు రియలిస్టిగ్గా సాగుతూ ఆకట్టుకున్నాయి. సర్కార్.. ముంబయి అటాక్స్.. కిల్లింగ్ వీరప్పన్ లాంటి సినిమాలు ఆ కోవలోనివే. తాజాగా అక్కినేని నాగార్జున హీరోగా వర్మ తీసిన ‘ఆఫీసర్’ కూడా ఈ తరహాదేనట. ఈ సినిమాకు తనకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి గురించి వర్మ వెల్లడించాడు.

ప్రస్తుతం ముంబయి క్రైమ్ బ్రాంచిలో అడిషనల్ కమిషనర్‌గా ఉన్న కేఎం ప్రసన్న స్ఫూర్తితోనే ‘ఆఫీసర్’లో నాగార్జున పాత్రను మలిచినట్లు వర్మ వెల్లడించాడు 2010లో ప్రసన్న తనకు చెప్పిన కొన్ని సంచలన ఘటనల ఆధారంగా ‘ఆఫీసర్’ కథను రూపొందించినట్లు తెలిపాడు. అటు ప్రసన్నతో.. ఇటు నాగార్జునతో వ్యక్తిగత సంభాషణల తర్వాత వాళ్లిద్దరిలో వ్యక్తిత్వ పరంగా చాలా పోలికలు ఉన్నట్లుగా అనిపించిందని.. ఇవన్నీ సినిమాలోకి తెచ్చే ప్రయత్నం చేశానని వర్మ చెప్పాడు.

ఎవరైనా పోలీస్ ఉన్నతాధికారి మీద ఆరోపణలు వస్తే.. విచారణ కోసం వేరే రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఒక అధికారి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను నియమిస్తారని.. అలా ముంబయిలో దారి తప్పిన ఒక పోలీసాఫీసర్ సంగతి తేల్చేందుకు హైదరాబాద్ నుంచి వచ్చే అధికారిగా నాగ్ కనిపిస్తాడని వర్మ వెల్లడించాడు. ఈ నెల 25నే రావాల్సిన ‘ఆఫీసర్’ అనివార్య కారణాల వల్ల జూన్ 1కి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ‘శివ’.. ‘అంతం’.. ‘గోవిందా గోవిందా’ సినిమాల తర్వాత నాగ్-వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాకు నిర్మాత కూడా వర్మే కావడం విశేషం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English