రంగస్థలం 50 రోజుల.. ఎన్ని సెంటర్లు

రంగస్థలం 50 రోజుల.. ఎన్ని సెంటర్లు

ఈసారి వేసవి వినోదానికి తెరతీసిన సినిమా ‘రంగస్థలం’. మార్చి నెలాఖర్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అద్భుత విజయాన్నందుకుంది. అంచనాల్ని మించి ఎక్కడికో వెళ్లిపోయింది. ముందుగా రూ.80 కోట్ల షేర్ మార్కును అందుకుని ‘మగధీర’ రికార్డును బద్దలు కొట్టింది. రామ్ చరణ్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. తర్వాత వంద కోట్ల షేర్ మార్కును అందుకుంది. ఆపై రూ.105 కోట్లతో ‘ఖైదీ నంబర్ 150’ పేరిట ఉన్న నాన్ బాహుబలి రికార్డునూ బద్దలు కొట్టింది. తర్వాత ఏకంగా రూ.120 కోట్ల షేర్ మార్కునూ అందుకుని చరిత్ర సృష్టించింది. ఆ చిత్ర గ్రాస్ వసూళ్లు కూడా రూ.200 కోట్ల మార్కును అందుకున్నాయి. ఇప్పుడు ‘రంగస్థలం’ మరో మైలురాయిని టచ్ చేసింది. ఈ చిత్రం 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.

50 రోజులంటే విడుదలై 50 రోజులు కావడం కాదు.. తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లు ఈ చిత్రాన్ని జెన్యూన్‌గా 50 రోజులు ఆడించాయి. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌‌లో ఉన్న సుదర్శన్ థియేటర్లో ఈ చిత్రం ఏడో వారంలో కూడా మంచి వసూళ్లతో నడిచింది. అక్కడ ఏకంగా రూ.2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50 రోజుల సెంటర్లు కనీసం 50 అయినా ఉంటాయని అంటున్నారు. అన్ని ప్రధాన కేంద్రాల్లోనూ ఈ చిత్రం ఇంకా ఆడుతోంది. ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమా అయినా రెండు మూడు వారాల తర్వాత థియేటర్ల నుంచి లేచిపోతున్న రోజులివి. లాంగ్ రన్ అనే మాటే లేదీ రోజుల్లో. ఇలాంటి సమయంలో ‘రంగస్థలం’ ఇంత నిలకడగా ఇన్ని రోజులు ఆడటం గొప్ప విషయమే. త్వరలోనే ఈ చిత్ర బృందం అర్ధశతదినోత్సవ వేడుకలు కూడా చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు