ఉదయ్ కిరణ్ బయోపిక్.. ఒక గాలి వార్త

ఉదయ్ కిరణ్ బయోపిక్.. ఒక గాలి వార్త

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా నటుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి రెండు రోజుల వ్యవధిలో రకరకాల ఊహాగానాలు వచ్చేశాయి. ఉదయ్ ని హీరోగా పరిచయం చేసిన అతడి గాడ్ ఫాదర్ తేజ ఈ సినిమా తీస్తున్నాడని.. దీనికి ‘కాబోయే అల్లుడు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడని.. ఈ చిత్రంలో ఉదయ్ పాత్రను నవదీప్ చేస్తున్నాడని.. చిరంజీవి పాత్రలో రాజశేఖర్ కనిపించబోతున్నడని.. ఇలా చాలా వార్తలే పుట్టుకొచ్చేశాయి.

నిజ్జంగా ఇది నిజమా అని అందరూ ఆశ్చర్యపోతుండగా.. ఈ ప్రచారానికి తెరదించే న్యూస్ చెప్పాడు తేజ. తాను ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదంటూ ఒక ఇంగ్లిష్ డైలీతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు తేజ. అసలీ వార్త ఎలా పుట్టిందో కూడా తనకు తెలియదని తేజ చెప్పాడు.

అలాగే తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ ఒక స్పష్టత ఇచ్చాడు తేజ. తన తర్వాతి సినిమా ఒక యాక్షన్ ఫిలిం అని చెప్పాడు. అలాగే తాను రానా దగ్గుబాటితో మళ్లీ కలిసి పని చేయబోతున్నట్లు కూడా తెలిపాడు. ఐతే తన తర్వాతి సినిమానే రానాతోనా అన్నది తేజ స్పష్టత ఇవ్వలేదు. ఇక తన దర్శకత్వంలో రాబోయే చిత్రంలో రానా పైలట్ పాత్ర చేయబోతున్నాడంటూ వస్తున్న వార్తల్ని తేజ ఖండించాడు. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పాడు.

వెంకటేష్‌ తో ఆగిపోయిన సినిమా గురించి కానీ.. ఎన్టీఆర్ బయోపిక్ గురించి కానీ తేజ మాట్లాడలేదు. దీంతో ‘ఎన్టీఆర్’ బయోపిక్ లోకి తేజ రీఎంట్రీ ఇస్తున్నాడన్న వార్తల్లో కూడా నిజం లేదనే భావించాలి. మరి తేజ ఇంత స్పష్టంగా చెబుతున్నపుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించి అంతలా ఊహాగానాలు ఎలా చెలరేగాయబ్బా?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు