‘ఆఫీసర్’ సినిమా ఎంత శ్రద్ధగా తీశాడంటే..

‘ఆఫీసర్’ సినిమా ఎంత శ్రద్ధగా తీశాడంటే..

రామ్ గోపాల్ వర్మ గత దశాబ్ద కాలంలో ఎలాంటి సినిమాలు తీశాడో తెలిసిందే. ‘ఐస్ క్రీమ్’ లాంటి నాసిరకం సినిమాలు తీసే స్థాయికి అతను పడిపోయాడు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వర్మతో నాగ్ ఈ దశలో సినిమా చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. కానీ ఈ కాంబినేషన్లో ‘ఆఫీసర్’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్ర టీజర్.. ట్రైలర్ అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. కానీ వర్మ గత సినిమాలతో పోలిస్తే కొంచెం నయం అనిపించాయి. ఐతే ఈ సినిమా విషయంలో తనను నమ్మొచ్చని అంటున్నాడు వర్మ. తాను శ్రద్ధ పెట్టి తీసిన సినిమా ఇదని అతనన్నాడు. ఈ సినిమాకు చేసిన కసరత్తు ఇటీవలి కాలంలో మరే సినిమాకూ చేయలేదని అతను చెప్పాడు. ఆ కసరత్తేంటో వర్మ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

''ఆఫీసర్‌ సినిమాలో ప్రతి సీన్ దగ్గరా ఒకసారి ఆగేవాడిని. ఇలాంటి సీన్ గతంలో నేనెప్పుడైనా తీశానా అని ప్రశ్నించుకుంటూ తీసేవాడిని. ప్రతి విషయాన్నీ పేపర్ మీద రాసుకుని.. సినిమాలో ఇలాగే తీస్తున్నానా అని ఆలోచించేవాడిని. అన్ని విషయాలూ పేపర్ మీద రాసుకుని ఇది సినిమాలో కనిపించిందా లేదా అని టిక్ వేసుకుని మరీ ఈ చిత్రం చేశా. 'ఆఫీసర్' సినిమా చేయడం కంటే.. మళ్లీ నాగార్జునను ఒప్పించి.. మెప్పించి.. ఆయనకు దగ్గరై కలిసి పని చేయడం వల్ల నాలో చాలా మార్పు వచ్చిందని నా అభిప్రాయం. ఇది నా తదుపరి సినిమాల మీద కూడా ప్రభావం చూపుతుందని ఆశిస్తున్నా'' అంటూ వర్మ తన శైలికి భిన్నంగా మాట్లాడాడు. ముంబయిలో తాను చూసిన కొందరు వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకుని 'ఆఫీసర్' కథ రాశానని.. ఒక పోలీస్ అధికారి మీద విచారణ చేయాల్సి వస్తే.. వేరే రాష్ట్రం నుంచి ప్రత్యేక విచారణ బృందాన్ని నియమిస్తారని.. అలా ముంబయిలో ఉన్న ఒక పోలీస్ అధికారిని విచారణ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చే ఆఫీసర్ కథ ఇదని వర్మ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు