డైరెక్టర్ శంకర్ బోరున ఏడ్చిన వేళ..

డైరెక్టర్ శంకర్ బోరున ఏడ్చిన వేళ..

డైరెక్టర్ శంకర్ తన సినిమాలకు సంబంధించిన వేడుకల్లో కానీ..ఇంకేదైనా కార్యక్రమాల్లో కానీ ఎక్కువ ఎమోషనల్ కావడం.. ఎగ్జైట్ కావడం ఎప్పుడైనా చూశారా? చాలా కూల్‌గా, కామ్‌గా కనిపిస్తుంటాడాయన. అలాంటివాడు ఒక రోజు షూటింగ్ స్పాట్‌‌లో వందల మంది ముందు బోరున ఏడ్చాడట. చాలా సేపు అలా ఏడుస్తూనే ఉన్నాడట. ఇది జరిగింది ‘అపరిచితుడు’ షూటింగ్ టైంలోనట. ఆ విషయాన్ని ఫైట్ మాస్టర్ సిల్వ వెల్లడించాడు. ఒకప్పుడు సిల్వ.. పీటర్ హెయిన్ దగ్గర పని చేసేవాడు. ‘అపరిచితుడు’ సినిమాకు పీటరే యాక్షన్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సినిమాలో హీరోయిన్ సదా అపరిచితుడి నుంచి తప్పించుకోవడానికి ఒక మార్షల్ ఆర్ట్స్ శిక్షణాలయంలోకి వెళ్తుంది. అప్పుడు పదుల సంఖ్యలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లు అతడి మీద అటాక్ చేస్తారు.

ఈ సీన్ తీసేటపుడు పెద్ద ప్రమాదం చోటు చేసుకుందట. ఇందులో హీరో విసిరి కొడితే పదుల సంఖ్యలో ఫైటర్లు ఎగిరి పడే సీన్ ఒకటుంటుంది. దాని కోసం సన్నాహాలు చేశారట. ఐతే లోపలి సెటప్‌కు తగ్గట్లుగా బయట ఒక లారీతో కనెక్ట్ చేసి పెట్టారట. ఐతే లోపలి నుంచి ఆదేశాలు అందకముందే బయట లారీని డ్రైవర్ ముందుకు పోనిచ్చాడట. దీంతో బిల్డింగ్ లోపల చాలా ఎత్తులో ఉన్న ఫైటర్లందరూ పదుల సంఖ్యలో ఒక్కసారిగా కిందట పడ్డారట. కింద ఉపరితలం చాలా గట్టిగా ఉండటంతో చాలామందికి తీవ్ర గాయాలయ్యాయట. ఫ్లోర్ మొత్తం రక్తంతో తడిసిపోయిందట. ఆ దృశ్యం చూసిన శంకర్ తట్టుకోలేకపోయాడట. చిన్నపిల్లాడిలా బోరున ఏడ్చాడట. వెంటనే అంబులెన్సులు తెప్పించి అందరినీ ఆసుపత్రికి తరలించామని.. అదృష్టం కొద్దీ ఎవరి ప్రాణాలూ పోలేదని.. కానీ చాలామంది తీవ్రంగా గాయపడ్డారని సిల్వ తెలిపాడు. షూటింగ్ టైంలో ఫైటర్లు ఇలాంటి ప్రమాదాలెన్నో ఎదుర్కొంటుంటారని సిల్వ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు