మహానటి ప్రతాపం ఇప్పుడు చూడండి

మహానటి ప్రతాపం ఇప్పుడు చూడండి

‘మహానటి’ అయితే గియితే క్లాసిక్ అవుతుందనుకున్నారు కానీ.. థియేటర్లకు జనాల్ని పరుగులు పెట్టించే మాస్ సినిమా అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఐతే అదిరిపోయే టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. వీకెండ్లో టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ నెలకొని.. ఆల్రెడీ ఆడుతున్న పెద్ద సినిమాల థియేటర్లను తీసి దీనికివ్వాల్సిన పరిస్థితి రావడం ఆశ్చర్యకరం. ఈ వారాంతంలో ఖాళీ ఉన్నప్పటికీ కొత్త తెలుగు సినిమాలేవీ రిలీజ్ చేయకపోవడానికి కూడా ‘మహానటి’భయమే కారణం. ఇలా ఖాళీ వదిలేసేసరికి ‘మహానటి’ వసూళ్లు రెండో వారాంతంలో ఊహించని విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ‘మహానటి’ సెకండ్ వీకెండ్ వసూళ్ల విషయంలో కొత్త రికార్డులు నెలకొల్పుతుందని అంచనా వేస్తున్నారు.

అమెరికాలో సైతం ‘మహానటి’కి రెండో వీకెండ్ ముంగిట స్క్రీన్లు పెంచడం విశేషం. ఇలా జరగడం అరుదు. అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఇప్పటి సినిమాలకు దూరంగా ఉంటున్న నిన్నటి తరం ప్రేక్షకులు పెద్ద ఎత్తున సావిత్రి కథను చూడ్డానికి థియేటర్లకు వస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా చూడటం ఒక సెలబ్రేషన్ లాగా సాగుతోందట. తొలి వీకెండ్లో అన్ని చోట్లా సినిమా అందుబాటులో లేదు. ఈ వారం పరిస్థితి మారింది. ‘నా పేరు సూర్య’ను పూర్తిగా లేపేసి.. ‘మహానటి’కి స్క్రీన్లు పెంచారు. దీంతో తొలి వారాంతానికి దీటుగా రెండో వారాంతపు వసూళ్లు ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 1.8 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. సెకండ్ వీకెండ్ అయ్యేసరికి 2.5 మిలియన్ మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. రిలీజ్ ముంగిట ఈ చిత్రంపై మరీ అంచనాలేమీ లేకపోవడంతో తక్కువ మొత్తానికే హక్కులు కట్టబెట్టారు. ఇప్పుడీ చిత్రం పెట్టుబడి మీద నాలుగైదు రెట్లు వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు