మొహం చెల్లని బీజేపీ నేతలు

బీజేపీ నేతలకు మొహం చెల్లటంలేదని తేలిపోయింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖపట్నం నుండి ఆదివారం ఢిల్లీకి వివిధ పార్టీల నేతలు, కార్మికనేతలు, కార్మికులు ప్రత్యేకరైలులో బయలుదేరారు. దానికిముందు వైజాగ్ లో కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీఎత్తున ఆందోళన జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఇంత పెద్దఎత్తున ఆందోళన జరుగుతుంటే ఇదే సమయంలో ఇంకోచోట కమలనాదులు పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు గడచిన 30 ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్నాయన్న విషయం రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అండ్ కో కు ఇపుడే హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఒకవైపు పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం నానా తిప్పలు పెడుతోంది. ఆ విషయం మాట్లాడకుండా ఇప్పటికే కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు రు. 11 వేల కోట్లిచ్చిందనే విషయాన్ని హైలైట్ చేస్తు మాట్లాడుకున్నారు.

గడచిన నాలుగు నెలలుగా వైజాగ్ లో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుంటే ఒక్క నేత కూడా కనీసం ఒక్కసారికూడా పరామర్శించలేదు. పైగా ఉక్కు ప్రైవేటీకరణ జరగదని అబద్ధాలతో మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేటీకరణ చేయబోతున్నట్లు కేంద్రం ఒకవైపు పార్లమెంటులోను, సుప్రింకోర్టు విచారణ సందర్భంగా స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే.

తన అజెండాతో కేంద్రం స్పష్టంగా ముందుకెళుతుంటే దానికి రివర్సులో కమలనాదులు జనాలను మాయచేయటానికి ప్రయత్నిస్తుండటమే విచిత్రంగా ఉంది. ఇదంతా చూస్తుంటే ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రత్యేకరైలు ఢిల్లీకి బయలుదేరినపుడు వివిధ పార్టీల నేతలు రైల్వేస్టేషన్లో వీడ్కోలు పలికారు. ఆ సమయంలో మొహం చెల్లకే కమలనాదులు ఎక్కడా కనబడలేదని అర్ధమైపోయింది.