మహాభారతం 20 ఏళ్లు తీస్తూనే ఉంటారట

మహాభారతం 20 ఏళ్లు తీస్తూనే ఉంటారట

మహాభారతం నేపథ్యంలో గతంలో చాలా సినిమాలొచ్చాయి. ఇక కొత్తగా అందులో తీయడానికేముందన్నట్లుగా తర్వాత దాన్నెవరూ ముట్టుకోలేదు. పైగా పౌరాణిక చిత్రాలకు కాలం చెల్లడంతో ‘మహాభారతం’ జోలికి ఎవ్వరూ వెళ్లలేదు. కానీ ఇప్పటి సాంకేతికతను ఉపయోగించుకుని ఆ కథను భారీతనంతో చెబితే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందన్న భరోసా నేటితరం ఫిలిం మేకర్లలో కనిపిస్తోంది.

ఈ క్రమంలోనే వేర్వేరు పరిశ్రమలకు చెందిన ప్రముఖ దర్శకులు.. హీరోలు మహాభారత కథతో సినిమా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మహాభారత గాథను తెరకెక్కించడం తన కల అని.. పదేళ్ల తర్వాత ఆ సినిమా తీస్తానని రాజమౌళి రెండు మూడేళ్ల కిందటే చెప్పాడు. అంటే ఆయన ఆలోచన మొగ్గదశలోనే ఉన్నట్లన్నమాట. మరోవైపు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో భీముడి కోణంలో మహాభారత గాథను తెరకెక్కించడానికి శ్రీకుమార్ అనే దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.

ఇంకోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ సైతం ‘మహాభారతం’ కల కంటున్నాడు. అతను కూడా ఈ సినిమా తీసేందుకు సన్నాహాల్లో ఉన్నాడు. ఇందుకోసం రాకేశ్ శర్మ జీవిత కథతో చేయాల్సిన సినిమాను కూడా వదులుకున్నాడు అమీర్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కలల ప్రాజెక్టు గురించి అమీర్ మాట్లాడుతూ.. ‘మహాభారతం’ను ఒక సినిమాగా తీయడం సాధ్యం కాదన్నాడు. ఇదొక బృహత్తరమైన ప్రాజెక్టు అని.. ఈ మొత్తం కథను భారీగా తీయాలంటే 20 ఏళ్లు పడుతుందని అతను చెప్పాడు. ఇంతకుమించి ఇప్పుడేమీ చెప్పలేనన్నాడు.

ఇప్పటికే అమీర్ వయసు 53 ఏళ్లు. ఇంకో రెండేళ్లకు ‘మహాభారతం’ మొదలుపెట్టాడంటే 75వ ఏట వరకు అతను ‘మహాభారతం’ తీస్తూనే ఉంటాడన్నమాట. అమీర్ లాంటి గొప్ప నటుడు ఇలా ఒక కథకే అంకితమైపోతే అభిమానులు తట్టుకోగలరా అన్నది సందేహం. ఇంతకీ ‘మహాభారత’ కథను ఎవరు తెరకెక్కించాలన్నది అమీర్ ప్లానో? ఆయన లిస్టులో మన జక్కన్న ఉన్నాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు