క్రికెటర్ కాబోతున్న హీరోయిన్

క్రికెటర్ కాబోతున్న హీరోయిన్

గత రెండు మూడేళ్లుగా తెలుగు సినిమాల్లో గొప్ప మార్పు చూస్తున్నాం. మన కథలు మారాయి.. హీరో హీరోయిన్ల పాత్రలూ మారుతున్నాయి. స్టీరియో టైపు క్యారెక్టర్లకు దాదాపుగా కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. కేవలం హీరోల పాత్రల వరకే కాకుండా హీరోయిన్ల పాత్రల్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

కథానాయిక పాత్ర ప్రత్యేకంగా ఉంటే ఆటోమేటిగ్గా కథ కూడా మరింత బలంగా తయారవుతుందన్న వాస్తవాన్ని రచయితలు.. దర్శకులు గుర్తిస్తున్నారు. వాళ్ల పాత్రల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో కథానాయికల్ని విభిన్నమైన పాత్రలు వరిస్తున్నాయి. ‘ఛలో’ సినిమాలో చిలిపి పాత్రతో ఆకట్టుకున్న రష్మిక మందాన్న.. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘డియర్ కామ్రేడ్‌’కు కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె క్రికెటర్ పాత్ర చేయనున్నట్లు వెల్డడించింది.

హీరోలు క్రికెటర్ల పాత్రలు వేయడమే తక్కువ. ఇక హీరోయిన్ ఆ పాత్రలో కనిపించడమంటే ఇంకా అరుదనే చెప్పాలి. బహుశా తెలుగులో ఇప్పటిదాకా ఏ హీరోయిన్ ఇలాంటి పాత్ర చేసి ఉండదేమో. ఏదో క్రికెటర్ అని పేరుకు చూపించడం కాకుండా సీరియస్‌గానే ఈ పాత్ర ఉంటుందట. ఈ క్యారెక్టర్ కోసం నెల కిందటి నుంచే ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టింది రష్మిక. ప్రొఫెషనల్ కోచ్‌ల దగ్గర ఆమె క్రికెట్ శిక్షణ తీసుకుంటోంది.

ఇప్పుడు తాను నిజం క్రికెటర్‌ లాగే ఫీలవుతున్నానని ఆమె చెప్పింది. బేసిగ్గా తనకు బాస్కెట్‌బాల్ అంటే ఇష్టమని.. క్రికెట్‌ను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదని.. కానీ తన పాత్ర కోసం శిక్షణ తీసుకున్నాక క్రికెట్‌తో లవ్‌లో పడిపోయానని రష్మిక చెప్పింది. మైత్రీ మూవీస్ లాంటి పెద్ద బేనర్ భాగస్వామ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు రూపొందించనున్నాడు. ఈ చిత్రం కాకినాడ నేపథ్యంలో సాగుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు