ఆ సినిమాలో ఏముంటాయ్.. ఫైట్లు తప్ప

ఆ సినిమాలో ఏముంటాయ్.. ఫైట్లు తప్ప

రంజాన్ పండగ వచ్చిందంటే సల్మాన్ ఖాన్ సినిమా ఉండాల్సిందే. ప్రతిసారీ ఈద్‌కు తన సినిమా రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటాడీ సూపర్ స్టార్. ఆ పండక్కి వచ్చే సల్మాన్ సినిమాలు చాలా వరకు విజయవంతం అవుతుంటాయి. కానీ గత ఏడాది మాత్రం అతను ఎదురు దెబ్బ తిన్నాడు. ‘ట్యూబ్ లైట్’ ఈద్‌కు రిలీజై డిజాస్టర్ అయింది. ఐతే గత ఏడాది చివర్లో ‘టైగర్ జిందా హై’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు సల్మాన్. ఇక ఈ ఏడాది రంజాన్ కానుకగా సల్మాన్ ‘రేస్-3’తో వస్తున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో.. రెండు నిమిషాలకు పైగా యాక్షన్ సన్నివేశాలే ఉన్నాయి. అవి ప్రపంచ స్థాయిలో ఉన్న మాట వాస్తవం. కానీ ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్లు ఇప్పటికే చాలా చూశాం.

అయినా ఈ తరం ప్రేక్షకులు కేవలం యాక్షన్ చూసి మురిసిపోయే స్థితిలో లేరు. ‘రేస్’ సిరీస్‌లో తొలి రెండు సినిమాలను అబ్బాస్-మస్తాన్ రూపొందించారు. వాళ్లు ఆసక్తికర మలుపులతో సినిమాను నడిపించారు. మూడో భాగాన్ని రెమో డిసౌజా చేతిలో పెట్టారు. అతనేమో కేవలం యాక్షన్‌నే నమ్ముకున్నట్లున్నాడు. సల్మాన్ తన అభిమానుల్ని అలరించేలా కనిపించాడు ట్రైలర్లో. కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం ఇందులో ఎగ్జైట్ చేసే అంశాలేమీ కనిపించలేదు. కుటుంబ సభ్యులే ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం అన్నది ‘రేస్’ ప్రథాన కథాంశం. ఆ నేపథ్యంలోనే తర్వాతి సినిమాలు కూడా సాగుతున్నాయి. ‘రేస్-3’లోనూ ఆ పాయింట్ ఉన్నట్లే కనిపిస్తోంది. మరి ఈ కాన్సెప్ట్.. యాక్షన్ సన్నివేశాలు కాకుండా అంతకుమించి సినిమాలో ఏం చూపిస్తారో చూడాలి. జూన్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు