ఆఫీసర్ వాయిదా పడిపోయిందిగా..

ఆఫీసర్ వాయిదా పడిపోయిందిగా..

అక్కినేని నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘ఆఫీసర్’ వచ్చే వారాంతంలో విడుదల కావట్లేదు. ఆ చిత్రాన్ని మే 25 నుంచి జూన్ 1కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మనే ధ్రువీకరించాడు. సాంకేతిక కారణాల వల్ల.. సినిమాకు ఇంకా తుది మెరుగులు దిద్దుతుండటం వల్ల సినిమాను వారం ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నట్లు వర్మ వెల్లడించాడు. కాబట్టి వచ్చే శుక్రవారం మాస్ రాజా సినిమా ‘నేల టిక్కెట్టు’.. కళ్యాణ్ రామ్ మూవీ ‘నా నువ్వే’ మాత్రమే రిలీజవుతాయన్నమాట. జూన్ 1కి ఆల్రెడీ షెడ్యూల్ అయిన రాజ్ తరుణ్ మూవీ ‘రాజుగాడు’తో పాటుగా ‘ఆఫీసర్’ వస్తుందన్నమాట.

ఐతే నిజంగా సాంకేతిక కారణాల వల్లే ‘ఆఫీసర్’ను వాయిదా వేస్తున్నారా అనే విషయంలో సందేహాలు కలుగుతున్నాయి. ఈ చిత్రానికి ముందు నుంచి ఎలాంటి బజ్ లేదు. సినిమాకు బిజినెస్ కూడా జరగలేదంటున్నారు. వివిధ కారణాల వల్ల రాను రాను సినిమాపై నెగెటివిటీ పెరిగిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంకో రెండు సినిమాలతో పాటుగా.. ముఖ్యంగా ‘నేల టిక్కెట్టు’ లాంటి మాస్ సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తే ప్రమాదమేమో అన్న సందేహాలు నెలకొన్నాయి.

అయినా వర్మ స్పీడేంటో తెలియనిది ఎవరికి? నెల కిందటే షూటింగ్ పూర్తి చేసి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయొచ్చంటే నమ్మగలమా? ఈ చిత్రాన్ని ఆల్రెడీ నాగార్జున ప్రివ్యూ కూడా చూశాడని వార్తలొస్తున్నాయి. మరి అంతా రెడీ అయిన సినిమాను వాయిదా ఎందుకు వేసినట్లు? మార్పులు చేర్పులైనా చేస్తుండాలి.. లేదంటే ఇంత పోటీలో ఎందుకు అని అయినా అనుకుని ఉండాలి. ఐతే వాయిదా వారమే కాబట్టి నాగ్ అభిమానులు అంత బాధపడాల్సిన పని లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English