'రంగస్థలం' పోస్టర్ ఇప్పుడు నిజమైంది

'రంగస్థలం' పోస్టర్ ఇప్పుడు నిజమైంది

గత రెండు నెలలుగా టాలీవుడ్ లో కలెక్షన్ పోస్టర్ల వార్ జరుగుతోంది. యుద్ధం అని నేరుగా ఎవరూ డిక్లేర్ చేయలేదు కానీ.. రామ్ చరణ్ రంగస్థలం.. మహేష్ బాబు భరత్ అనే నేను.. అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రాలకు.. అంత గ్రాస్.. ఇన్ని వందల కోట్ల గ్రాస్ వసూళ్లు అంటూ పోస్టర్లు కనిపిస్తూనే ఉన్నాయి.

మిగిలిన వాటిని పక్కన పెడితే.. ఈ ఏడాది మొదటగా సాలిడ్ సక్సెస్ సాధించిన మూవీ రంగస్థలం. సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రానికి టాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పలికారు. ఇప్పుడీ చిత్రం 200 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటినట్లు.. ట్రేడ్ జనాలు కన్ఫర్మ్ చేశారు. తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యి.. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను రాబట్టిన తొలి చిత్రం రంగస్థలం. బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటూ రంగస్థలం మేకర్స్ వేస్తున్న పోస్టర్స్ కు కూడా అర్ధం ఇదే. బాహుబలి ఇతర భాషల్లో రిలీజ్ అయినా కూడా.. రెండు భాగాలు కేవలం తెలుగు వెర్షన్ వరకే 200 కోట్లను దాటగలిగాయి. కానీ ఆ మూవీ థీమ్.. కాన్వాస్.. చాలా పెద్దది అనే విషయం ఒప్పుకోవాల్సిందే.

బాహుబలి ది బిగినింగ్ రూ. 600 కోట్ల గ్రాస్ ను.. బాహుబలి ది కంక్లూజన్ 1700 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగలిగాయి. బాహుబలి2 విషయంలో చైనా కలెక్షన్ ను ఇంకా కలపాల్సి ఉంది. ఇవి కాకుండా సౌత్ ఇండియా నుంచి 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రాలు మరో 3 ఉన్నాయి. రజినీకాంత్- శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో.. రజినీ మూవీ కబాలి.. శంకర్ రూపొందించిన ఐ.. విజయ్ మూవీ మెర్సల్.. ఈ నాలుగు సినిమాలు కూడా 200 కోట్ల మార్క్ దాటాయి.

రోబో.. కబాలి అయితే 250 కోట్ల మార్క్ ను అధిగమించాయి. మెర్సల్.. ఐ.. చిత్రాలు 200 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగలిగాయి. వీటిలో మెర్సల్ మాత్రమే ఒకే భాషలో 200 కోట్ల మార్క్ ను దాటగలిగింది. ఇప్పుడు రంగస్థలం కూడా ఈ ఫీట్ ను సాధించి.. ఎలైట్ క్లబ్ లో చేరింది.

అయితే.. మే 13న రంగస్థలం ఈ ఫీట్ ను సాధించిందని ట్రేడ్ జనాలు చెబుతున్నారు. కానీ మే నెల 1వ తేదీనే రంగస్థలంకు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ పోస్టర్ పడింది. కాకపోతే.. 200 కోట్లవైపు పరుగులు తీస్తున్న సినిమా అని వేశారు. కొన్ని రోజుల క్రితం.. 200 క్రోర్స్ అండ్ కౌంటింగ్ అని కూడా పోస్టర్ వచ్చేసింది. కానీ ఇప్పటికి ఆ పోస్టర్ నిజమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు