కొత్త సినిమాల చప్పుడే లేదేంటి?

కొత్త సినిమాల చప్పుడే లేదేంటి?

వేసవిలో భారీ సినిమాల సందడికి తెరపడింది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ‘మహానటి’ హవా నడుస్తోంది. ముందు దీనిపై అంచనాలు అంతంతమాత్రమే కానీ.. విడుదల తర్వాత కథ మారిపోయింది. ఓ పెద్ద హీరో సినిమా స్థాయిలో ఇది ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ వారానికి తెలుగులో ఏ కొత్త సినిమా రిలీజ్ కావట్లేదు. ఒకట్రెండు సినిమాలకు ఛాన్సులన్నా ‘మహానటి’కి భయపడే రిలీజ్ చేయలేదు. ఇంకో వారం వరకు‘మహానటి’ హవానే సాగే అవకాశముంది. తర్వాతి వారానికి ఒకటికి మూడు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. కానీ ఆ మూడు సినిమాల విషయంలో ఎలాంటి బజ్ కనిపించడం లేదు. రిలీజ్ ముంగిట ఏమైనా పరిస్థితి మారుతుందో ఏమో కానీ.. ప్రస్తుతానికైతే ఈ కొత్త సినిమాలకు హైప్ లేదు.

ఆ మూడు సినిమాల్లో మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. మాస్ రాజా రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీని టీజర్ చాలా సాధారణంగా కనిపించింది. ఇప్పటిదాకా ప్రమోషన్లు పెద్దగా చేయలేదు. మరోవైపు నాగార్జున-వర్మల ‘ఆఫీసర్’పైనా ముందు నుంచి ఏమాత్రం అంచనాల్లేవు. దీనికి తోడు టీజర్లు.. ట్రైలర్లు నిరాశ పరిచాయి. వర్మ ట్రాక్ రికార్డు.. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆయనపై జనాల్లో ఉన్న నెగెటివిటీ ప్రభావం ఈ సినిమాపై పడేలా ఉంది.

మరోవైపు ‘నా నువ్వే’ పరిస్థితీ ఏమంత మెరుగ్గా లేదు. ‘180’ లాంటి పెద్ద ఫ్లాప్ తర్వాత జయేంద్ర ఈ సినిమా తీయడం.. కళ్యాణ్ రామ్ తన శైలికి పూర్తి భిన్నంగా క్లాస్ సినిమా చేసేసరికి దీనిపై ఏ వర్గం ప్రేక్షకుల్లోనూ ఆసక్తి కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే ఈ మూడు సినిమాల గురించి పెద్దగా చర్చే లేదు. రిలీజ్ వీక్‌లో ఏమైనా పరిస్థతి మెరుగవుతుందేమో చూడాలి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English