బన్నీ.. వాట్ ఎ కామెంట్

బన్నీ.. వాట్ ఎ కామెంట్

‘‘లెక్కలేసుకుని సినిమా చేస్తే లెక్క పెట్టుకునేంతే వస్తుంది.. కానీ లెక్కలు చూసుకోకుండా సినిమా చేస్తే లెక్క పెట్టలేనంత వస్తుంది’’.. ఇదీ ఇటీవలే అల్లు అర్జున్ చేసిన కామెంట్. ఇంతకీ ఈ కామెంట్ దేన్ని ఉద్దేశించి అంటారా..? ‘మహానటి’ సినిమా విషయంలోనే. అశ్వినీదత్ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. వాళ్లు కమర్షియల్ లెక్కలేసుకోకుండా.. సినిమా ఎలా ఆడుతుందో.. ఏమాత్రం పెట్టుబడిని వెనక్కి తెస్తుందో అని ఆలోచించకుండా ఒక గొప్ప సినిమా కోసం ఏం కావాలో అంతా సమకూర్చారు. ఎక్కడా రాజీ పడకుండా ఒక క్లాసిక్ లాగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ విషయాన్నే ఎలివేట్ చేస్తూ బన్నీ ఆ కామెంట్ చేశాడు. అతడి మాట నూటికి నూరు శాతం నిజం.

ఇప్పుడు ‘మహానటి’కి వస్తున్న వసూళ్లు చూసి అందరూ విస్తుపోతున్న పరిస్థితి. అశ్వినీదత్.. ఆయన అల్లుడు నాగ్ అశ్విన్.. కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి చేసిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. రోజు రోజు మామూలుగా మొదలై.. మ్యాట్నీ నుంచే అద్భుతంగా పుంజుకున్న ఈ చిత్రం ఒక మాస్ సినిమా స్థాయిలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రం దత్ కుటుంబానికి గౌరవమే కాదు.. భారీగా డబ్బులు కూడా తెచ్చి పెడుతోంది.

ఇక బన్నీ ‘మహానటి’ గురించి ఇంకా చెబుతూ.. ఈ సినిమా చూశాక తాను దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ఫోన్ చేశానని.. ఐతే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటి పిచ్చి పదాలు వాడకుండా ‘థ్యాంక్యూ ఫర్ మేకింగ్ అజ్ ప్రౌడ్’ అని చెప్పానన్నాడు. దత్ ఫ్యామిలీ తప్ప ఇలాంటి సినిమా ఎవ్వరూ తీయలేరని.. మహానటి ఒక ఎక్స్‌పీరియన్స్ అని.. ప్రైజ్ లెస్ అని బన్నీ అన్నాడు. ఒకవైపు తన సినిమా ‘నా పేరు సూర్య’ థియేటర్లలో ఉండగా.. దానిపై ‘మహానటి’ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండగా.. బన్నీ తన తండ్రితో కలిసి ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలిపేందుకు స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English