కుర్రాడికిది గట్టి దెబ్బే

బాల నటుడిగా దాదాపు 50 సినిమాల్లో నటించి మంచి పేరే సంపాదించాడు తేజ. చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన చాలామంది హీరోలవ్వడం కామనే కానీ.. అందులో నిలదొక్కుకున్న వాళ్లు తక్కువ. ఐతే తేజ ఒకేసారి హీరో అయిపోకుండా ‘ఓ బేబీ’లో ఓ కీలక పాత్రతో సత్తా చాటుకుని.. ఆ తర్వాత ‘జాంబిరెడ్డి’తో హీరోగా మారాడు. ఆ చిత్రం మంచి ఫలితాన్నందించింది తేజకు.

ఈ ఊపులో వరుసగా హీరోగా అవకాశాలు అందుకుంటున్నాడు తేజ. ఇప్పటికే ‘ఇష్క్’ సినిమా చేసిన అతను.. రాజశేఖర్ కూతురు శివానితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ‘జాంబి రెడ్డి’ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ‘హనుమాన్’ కూడా లైన్లో ఉంది. ఐతే తాజాగా ‘ఇష్క్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ సినిమా తేజకు తీవ్ర నిరాశ కలిగించేలాగే కనిపిస్తోంది. మలయాళ మూవీ ‘ఇష్క్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో డిజాస్టర్ టాక్ వినిపిస్తోంది.

మ‌ల‌యాళంలో ఇష్క్ ఒక మంచి ప్ర‌యోగంగా పేరు తెచ్చుకుంది. ఐతే అక్క‌డ కూడా సినిమా మీద నెగెటివ్ రిమార్క్స్ త‌ప్ప‌లేదు. చిన్న పాయింట్‌ను ప‌ట్టుకుని మ‌రీ సాగ‌దీశార‌ని.. స‌న్నివేశాలు రిపిటీటివ్ అని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తెలుగులో రీమేక్ చేస్తున్న‌పుడు ఆ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త ప‌డాల్సింది. మ‌న ప్రేక్ష‌కులు మ‌రీ ఇంత సింపుల్ స్టోరీల‌ను ఆద‌రించ‌డం త‌క్కువ‌. స్క్రీన్ ప్లే రేసీగా ఉండాల‌ని.. కొంచెం హ‌డావుడి ఉండాల‌ని కోరుకుంటారు.

కానీ ఒరిజిన‌ల్‌ను ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేయ‌డం.. ఒరిజిన‌ల్లోని ఆత్మ‌ను ప‌ట్టుకోవ‌డంలో విఫ‌లం కావ‌డంతో సినిమాకు ఇక్క‌డ పూర్తి నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. మ‌న ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా రుచించ‌క మ‌ధ్య‌లోనే లేచి థియేట‌ర్ల నుంచి వెళ్లిపోతుండ‌టం గ‌మ‌నార్హం. హీరోయిన్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ సంగ‌త‌లా వ‌దిలేస్తే హీరో తేజ‌కు ఈ సినిమా పెద్ద మైన‌స్ అన‌డంలో సందేహం లేదు. కెరీర్ ఊపులో సాగుతున్న స‌మ‌యంలో ఈ సినిమా ఒప్పుకుని త‌ప్పు చేశాడ‌ని.. అన‌వ‌స‌రంగా ఓ ఫ్లాప్ త‌న ఖాతాలో వేసుకున్నాడ‌నే అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి