కొత్త సినిమా.. ఫేక్ ప్రచారం!

కొత్త సినిమా.. ఫేక్ ప్రచారం!

సోషల్ మీడియా పుణ్యమా అని సినిమాల అసలు ఫలితం ఏంటో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో పడిపోతున్నారు జనం. గత కొన్నేళ్లలో దీని ప్రాధాన్యం బాగా పెరిగిపోవడంతో సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోసమే హీరోలు.. దర్శకులు.. నిర్మాతలు టీంలను తయారు చేసి పెట్టుకుంటున్నారు. ఈ టీంలకు పీఆర్వోలు నాయకత్వం వహిస్తుంటారు. హీరోల.. దర్శకుల అభిమానుల్ని మొబిలైజ్ చేయడం ద్వారానో.. లేక ఇంకో రకంగానో.. సినిమాకు అతి ప్రచారం చేసి పెట్టడానికి వీళ్లు కొన్ని బ్యాచ్‌లను తయారు చేసి పెట్టుకుంటారు.

వాళ్లకు డబ్బులిచ్చి మేనేజ్ చేయడం ద్వారా సినిమా ఎలా ఉన్నా సరే.. ఆహా ఓహో అని ట్వీట్లు వేయించడం వీళ్ల డ్యూటీ. ఇంకా సినిమా మార్నింగ్ షో కూడా పూర్తయి ఉండదు.. అప్పుడే ‘హియరింగ్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఫర్....’ అంటూ మొదలుపెడతారు ఈ జనాలు. యుఎస్ నుంచి అదిరిపోయే రిపోర్ట్స్ వస్తున్నాయని.. సినిమా సూపరని డూపరని ఊదరగొడతారు. నటీనటుల్ని.. దర్శక నిర్మాతల్ని తెగ పొగిడేస్తూ.. సినిమాలోని హైలైట్ల గురించి చెబుతూ ట్వీట్ల మీద ట్వీట్లు వేస్తారు. వాళ్ల ట్వీట్లు.. వాళ్ల ప్రొఫైల్స్ చూస్తే సినిమాతో ఏ సంబంధం లేని సామాన్యుల్లాగే కనిపిస్తారు. వీళ్లు ఏసే ట్వీట్లు చూసి సినిమాకు వెళ్తే అంతే సంగతులు.

తాజాగా ఒక కొత్త సినిమాకు ఇలాంటి ప్రచారం శ్రుతి మించిపోతోంది. నిజానికి ఆ చిత్రానికి చాలా బ్యాడ్ టాక్ వచ్చింది. ఇటు సమీక్షకులు.. అటు సామాన్య ప్రేక్షకులు సినిమా చూసి పెదవి విరిచారు. దానికి ఓపెనింగ్స్ కూడా దారుణంగా వచ్చాయి. వీకెండ్ తర్వాత అయితే అసలు సినిమాను పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి సినిమా గురించి సోషల్ మీడియాలో పడుతున్న ట్వీట్లు.. వాటిని చిత్ర బృందంలోని వ్యక్తులు అదే పనిగా రీట్వీట్లు చేస్తూ.. సినిమా సక్సెస్ సంబరాలు చేసుకుంటూ చేస్తున్న హడావుడి చూస్తే జనాలకు చిర్రెత్తుకొస్తోంది. ఓవైపు సినిమా చూసిన చిరాకుకు తోడు.. ఇలాంటి హంగామా చూస్తే మండిపోకుండా ఎలా ఉంటుంది? ఒకప్పుడు ఆ దర్శకుడి సినిమా వస్తే జెన్యూన్‌గానే జనాలు సోషల్ మీడియాను హోరెత్తించేవాళ్లు. కానీ ఇప్పుడు ఇలాంటి ఫేక్ ప్రచారాలతో జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ తనను తాను మోసం చేసుకుంటూ బతికేయాల్సిన దుస్థితికి చేరాడంటూ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు