పూరి ఆకాశ్.. ఆగాల్సింది పాపం

పూరి ఆకాశ్.. ఆగాల్సింది పాపం

పూరి జగన్నాథ్ చేతుల మీదుగా రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో పరిచయం అయ్యాడు. పెద్ద స్థాయికి వెళ్లాడు. టాలీవుడ్లో ఇంకా చాలామంది స్టార్లకు కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చిన ఘతన పూరీదే. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ వీళ్లందరూ పూరితో జత కట్టి ఆయా సమయాల్లో తమ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లు అందుకున్నారు. అలాంటివాడు తన కొడుకు ఆకాశ్‌ను మాత్రం కాపాడలేకపోయాడు. తన కెరీర్ బాగా డౌన్‌లో ఉన్న సమయంలో ఆకాశ్‌ను ‘మెహబూబా’తో పరిచయం చేశాడు. ఈ సినిమాతో పూరి మళ్లీ ఫామ్ అందుకోవడంతో పాటు ఆకాశ్‌కు కూడా హీరోగా మంచి లాంచింగ్ దొరుకుతుందని ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

నిజానికి ఆకాశ్‌ను హీరో చేసే విషయంలో పూరి తొందరపడ్డాడనే అంటున్నారందరూ. ఎందుకంటే ‘మెహబూబా’ సినిమాలో అతను హీరోలా కనిపించలేదు. నటన బాగానే ఉన్నప్పటికీ.. అతను ఆ పాత్రకు సరిపోలేదు. ఇంకా అతడి ముఖంలో పసితనపు ఛాయలు పోలేదు. అప్పుడే ఒక గాఢమైన ప్రేమకథ చేసే హీరోలా కనిపించలేదతను. హీరోయిన్ నేహా శెట్టి ముందు చిన్న పిల్లాడిలాగే కనిపించాడు ఆకాశ్. తన కొడుకు విషయంలో పూరి ఇంతకుముందు కూడా ఒక తప్పు చేశాడు. అతడితో ‘ఆంధ్రాపోరి’ చేయించాడు. అది కూడా వ్యర్థ ప్రయత్నమే అయింది. అప్పుడు తప్పటడుగు వేస్తే వేశాడు కానీ.. పూర్తి స్థాయి హీరోను చేసే విషయంలో మాత్రం ఆగాల్సిందేమో. ఇంకొంత వయసు పెరిగి.. ఆకాశ్‌లో పసితనపు ఛాయలు పోయి పెద్దవాడై హీరో పాత్రలు చేసే లుక్ వచ్చే దాకా ఆగాల్సింది. కానీ అప్పటికి తన పరిస్థితి ఇంకా వరస్ట్ అవుతుందనుకున్నాడో ఏమో.. పూరి తొందరపడిపోయాడు.

పూరి ట్రాక్ రికార్డు చూసి స్టార్లెవరూ అతడితో సినిమాలు చేయడానికి ముందుకు రాని పరిస్థితుల్లోనే కొడుకు లాంచింగ్ గురించి పూరి ఆలోచించాడేమో అని కూడా భావిస్తున్నారు. ఒకప్పుడు పూరితో సినిమా చేయడానికి ప్రతి హీరో ఎగబడేవాడు. ఆయనతో ఒక సినిమా చేయడం టార్గెట్‌గా ఉండేది. అలా ఎంతోమందికి హిట్లిచ్చిన పూరి.. కొడుకుకు మాత్రం అన్యాయం చేశాడు. ఇలాంటి టైమింగ్‌లో తన తండ్రితో సినిమా చేయాల్సి రావడం ఆకాశ్ దురదృష్టం. ఏదేమైనా టాలెంటెడ్ యాక్టర్‌లా కనిపిస్తున్న ఆకాశ్‌ను తండ్రే దెబ్బ కొట్టాడు. ఐతే ఈ దెబ్బ ఇక్కడితో ఆగదట. ‘మెహబూబా’తర్వాత తన రెండు సినిమాలు కూడా కొడుకుతోనే ఉంటాయన్నాడు పూరి. ఈ సంగతి తెలిసి ఆకాశ్‌ను చూసి జాలిపడుతున్నారు జనం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు