44వ రోజు ‘రంగస్థలం’ జోరు చూడండి

44వ రోజు ‘రంగస్థలం’ జోరు చూడండి

గత కొన్నేళ్లలో మల్టీప్లెక్సుల హవా బాగా పెరిగినప్పటికీ.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని భారీ థియేటర్లలో సినిమా చూడటాన్ని ఇప్పటికే నగర వాసులు చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఘన చరిత్ర ఉన్న థియేటర్లెన్నో అక్కడున్నాయి. అక్కడి థియేటర్లలో కొత్త సినిమాల వసూళ్లు ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. వేరే సింగిల్ స్క్రీన్లతో పోలిస్తే ఇక్కడ హంగామా ఎక్కువగా ఉంటుంది. వసూళ్లు కూడా మెరుగ్గా ఉంటాయి. ఒక కొత్త సినిమా ఎలా ఆడుతోందో చెప్పడానికి ఇక్కడి వసూళ్లను ప్రామాణికంగా తీసుకుంటారు.

ఇక్కడి ప్రఖ్యాత సుదర్శన్ 70 ఎంఎం థియేటర్లో ‘రంగస్థలం’ చిత్రం వీకెండ్లో ఇప్పటికీ చాలా బాగా ఆడుతుండటం విశేషం. విడుదలైన 44వ రోజు సైతం ఫస్ట్ షోకు దాదాపుగా హౌస్ ఫుల్ కావడం.. రూ.1,18,128 షేర్ రాబట్టడం విశేషం. రోజు మొత్తంలో నాలుగు షోలకు కలిపి ఈ ఆదివారం రూ.2.98 లక్షల కలెక్షన్లు రావడం విశేషం.

ఇక ‘మహానటి’ విషయానికి వస్తే క్రాస్ రోడ్స్‌లో రెండు థియేటర్లలో ఆడుతోంది. శాంతి థియేటర్లో ఈ చిత్రం రోజు మొత్తంలో 3.03 లక్షలు రాబట్టింది. మయూరి థియేటర్లో రూ.2.92 లక్షలు వసూలయ్యాయి. అద్భుతమైన టాక్ తెచ్చుకున్న ‘మహానటి’కి దీటుగా ‘రంగస్థలం’ వసూళ్లు రాబట్టడం విశేషమే. సంధ్య 70 ఎంఎంలో ‘నా పేరు సూర్య’ రూ.2.48 లక్షలు.. సంధ్య 35 ఎంఎంలో ‘భరత్ అనే నేను’ రూ.2.19 లక్షలు వసూలు చేసింది.

ఇక ఈ శుక్రవారం రిలీజైన ‘మెహబూబా’ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆదివారం మొత్తంలో ఈ చిత్రం లక్ష రూపాయల షేర్ కూడా రాబట్టలేదు. దేవి 70 ఎంఎంలో ఈ చిత్రం నాలుగు షోలకు కలిపి రూ.98 వేలతో సరిపెట్టుకుంది. ఇక్కడ అన్నిటికంటే ఆశ్చర్యకరమైన వసూళ్లంటే ‘రంగస్థలం’వే. ఎంత మంచి టాక్ తెచ్చుకున్న సినిమాకైనా రెండు మూడు వారాలకే థియేట్రికల్ రన్ ముగిసిపోతున్న ఈ రోజుల్లో 50వ రోజుకు చేరువ అవుతూ ఇలా ఆడుతుండటం ఆశ్చర్యమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు