దెబ్బ కొట్టిన సినిమాకు డిన్నరిచ్చారు

దెబ్బ కొట్టిన సినిమాకు డిన్నరిచ్చారు

పది రోజుల కిందట భారీ అంచనాల మధ్య రిలీజైంది ‘నా పేరు సూర్య’. ఈ సినిమాకు డివైడ్ టాక్  వచ్చింది. ఇంతకుముందు కూడా అల్లు అర్జున్ సినిమాలు కొన్ని డివైడ్ టాక్‌తోనే బాగా ఆడేసిన నేపథ్యంలో ఇది కూడా ఆ బాటలోనే సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తొలి రోజు నుంచే ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు వసూళ్లు రాబట్టలేకపోయింది.

వీకెండ్లో ఓ మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టుకుంది. వీకెండ్ తర్వాత పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారైంది. వసూళ్లు బాగా పడిపోయాయి. అల్లు అర్జున్ సినిమాను గట్టిగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. వీక్ డేస్ సంగతెలా ఉన్నా.. రెండో వీకెండ్లో సినిమా మళ్లీ పుంజుకుంటుందని భావించగా.. ఆ అవకాశమే లేకుండా చేసింది ‘మహానటి’. అందరూ ఈ చిత్రాన్ని తక్కువ అంచనా వేశారు కానీ.. అది అనూహ్యమైన వసూళ్లతో ఆశ్చర్యపరిచింది.

వీకెండ్లో ‘మహానటి’ టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ‘నా పేరు సూర్య’ స్క్రీన్లను తీసి దీనికివ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మిగతా థియేటర్లలోనూ  ‘నా పేరు సూర్య’ వసూళ్లపై ‘మహానటి’ బాగా ప్రభావం చూపింది. ఆ రకంగా బన్నీ సినిమాను ‘మహానటి’ పెద్ద దెబ్బే కొట్టింది. ఆ చిత్రం బయ్యర్లకు భారీ నష్టాలు మిగల్చడం ఖాయమని తేలిపోయింది. ఇందులో ‘మహానటి’ పాత్ర కూడా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘మహానటి’పై బన్నీ అండ్ కోకు పరోక్షంగా అసహనం ఉండాలి. కానీ అదేమీ చూపించకుండా బన్నీ.. ఆయన తండ్రి అల్లు అరవింద్ కలిసి ‘మహానటి’ టీంకు డిన్నర్ ఇవ్వడం విశేషం.

ఈ మధ్య హీరోల మధ్య అంతరాలు తొలగిపోయి ఒకరి సినిమాను ఒకరు అభినందించడం.. పార్టీల్లో పాల్గొనడం చూస్తున్నాం. ఈ కోవలోనే తమ సినిమాకు పోటీగా వచ్చిన చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తూ ఆ చిత్ర బృందానికి పార్టీ ఇవ్వడం విశేషమే. చిరంజీవి రెండు రోజుల కిందటే ప్రెస్ మీట్ పెట్టి మరీ ‘మహానటి’ టీంను అభినందిస్తే.. ఇప్పుడు అల్లు వారు ఇలా డిన్నర్ ఇవ్వడం మంచి పరిణామమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English