ఆ బన్నీ అభిమాని చనిపోయాడు

ఆ బన్నీ అభిమాని చనిపోయాడు

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇటీవలే తన పెద్ద మనసు చాటుకున్నాడు. అనకాపల్లిలో బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న దేవ్ సాయి గణేష్ అనే ఒక అభిమానిని తన ఇంటికి వెళ్లి కలిసి వచ్చాడు. తన సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నప్పటికీ.. వీలు చేసుకుని శనివారం హైదరాబాద్ నుంచి అనకాపల్లికి వెళ్లాడు. అక్కడ అభిమానులతో కలిసి దేవ్ ఇంటికి వెళ్లాడు. అతడిని పరామర్శించాడు. ప్రేమగా మాట్లాడి ఫొటోలు దిగాడు. అంతే కాక దేవ్ చికిత్స కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం కూడా అందజేశాడు. దేవ్ త్వరగా కోలుకోవాలని అభిలషించాడు. కానీ అతడి ఆకాంక్ష ఫలించలేదు. దేవ్ కోలుకోలేదు. అతడి ఆరోగ్యం మరింత క్షీణించి ఆదివారం తుది శ్వాస విడిచాడు.

బన్నీ కలిసి వచ్చిన వారానికే దేవ్ చనిపోవడం అభిమానులందరినీ కలచి వేసింది. తన చివరి కోరికగా అల్లు అర్జున్‌ను చూడాలని ఉందని దేవ్ చెబితే.. అతడి అన్నయ్య సోషల్ మీడియా ద్వారా బన్నీ పీఆర్వోలను సంప్రదించడం.. బన్నీ స్పందించి అక్కడికి వెళ్లడం జరిగింది. ఆ సందర్భంగా దేవ్ ఆనందానికి అవధుల్లేవు. కానీ ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది. దీనిపై బన్నీ స్పందించే అవకాశాలున్నాయి.

సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక అభిమానులెవరికైనా పెద్ద కష్టం వచ్చినట్లు తమ దృష్టికి వస్తే హీరోలు స్పందిస్తున్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు అనారోగ్యంతో బాధపడుతున్న తమ అభిమానుల్ని కలుసుకుని వారికి ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. పవన్ అలా పరామర్శించి వచ్చిన ఓ చిన్నారి ఆశ్చర్యకరంగా అనారోగ్యం నుంచి కోలుకుని మామూలు మనిషి కూడా అయింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు