‘మహానటి’ని అంచనా వేయలేం

‘మహానటి’ని అంచనా వేయలేం

‘మహానటి’ సినిమా వ్యవహారం చూస్తే దీనికి ఎంత మంచి టాక్ వచ్చినా.. వసూళ్లేమంత గొప్పగా ఉండవన్న అంచనాలే ఉన్నాయి విడుదలకు ముందు. కానీ ఏ సినిమా ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు. ఆ సినిమా రిలీజైన టైమింగ్.. వచ్చి న టాక్ ను బట్టి కొన్నిసార్లు అనూహ్య ఫలితాలొస్తుంటాయి. ‘మహానటి’ విషయంలోనూ అలాగే జరుగుతోంది. ఈ చిత్రం ఒక మాస్ సినిమా తరహాలో అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. శని ఆదివారాలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయి టికెట్లు దొరకని పరిస్థితి కనిపిస్తుండటం విశేషం. ఇటు తెలుగు రాష్ట్రాల్లో.. అటు తమిళనాడులో.. మరోవైపు యుఎస్‌లో ఈ చిత్రం అదరగొట్టేస్తోంది. అంచనాల్ని మించి వసూళ్లు సాధిస్తోంది. అమెరికాలో ఈ చిత్రం వీకెండ్ కూడా అవ్వకుండానే మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరిపోవడం విశేషం.

శనివారం షోలన్నీ పూర్తి కాకముందే ‘మహానటి’ మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టడం విశేషం. ఆదివారం కూడా షోలు అయ్యేసరికి ఈ చిత్రం 1.4 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న ఊపులో ఈ చిత్రం ఈజీగా 2 మిలియన్ మార్కును అందుకునే అవకాశాలున్నాయి. అసలు వచ్చే వారాంతానికి తెలుగు సినిమాలేవీ రిలీజయ్యే అవకాశాలు కనిపించని నేపథ్యంలో ఈ చిత్రం రెండో వీకెండ్లో కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశముంది. కాబట్టి కేవలం 2 మిలియన్ దగ్గరే ఆగిపోతుందని కూడా అనుకోలేం. సరిగ్గా ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందో చెప్పలేం. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి సరైన డిమాండ్ లేకపోవడంతో చాలా చోట్ల సొంతంగా రిలీజ్ చేసుకున్నారు నిర్మాత అశ్వినీదత్. కొన్ని ఏరియాల హక్కుల్ని చాలా తక్కువ మొత్తానికే ఇచ్చేశారు. ఆ బయ్యర్ల పంట పండినట్లే. అలాగే సొంతంగా రిలీజ్ చేసుకున్న ఏరియాల ద్వారా దత్‌ కు మంచి లాభాలు అందబోతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు