బన్నీని పరిచయం చేయాల్సింది తేజానా?

బన్నీని పరిచయం చేయాల్సింది తేజానా?

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వందో సినిమా ‘గంగోత్రి’తో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు అల్లు అర్జున్. ఆ సినిమా అప్పట్లో మంచి ఫలితాన్నే అందుకుంది. కానీ ఆ చిత్రం గురించి చెప్పుకోవడానికి ఎప్పుడూ అంతగా ఇష్టపడడు బన్నీ. అందుక్కారణం.. ఆ చిత్రంలోని అతడి పాత్ర.. లుక్సే కారణం. ఆ చిత్రంలో బన్నీ కనిపించిన విధానం ఏమంత బాగోదు. పైగా ఇది యూత్‌ఫుల్ మూవీ కాదు. రెండో సినిమా ‘ఆర్య’లో అతడి లుక్కే మారిపోయింది. ఆ సినిమా కూడా యువతను విశేషంగా ఆకట్టుకుంది. అందుకే బన్నీ తన కెరీర్ ఎదుగుదల గురించి మాట్లాడేటపుడు ‘ఆర్య’ దగ్గర్నుంచి మొదలుపెడుతుంటాడు. రాఘవేంద్రరావు ద్వారా హీరోగా పరిచయం అయిన వాళ్లు పెద్ద రేంజికి వెళ్తారన్న సెంటిమెంటుతో అరవింద్ బన్నీని ఆయన చేతుల్లో పెట్టి ఉండొచ్చు. ఐతే నిజానికి బన్నీని పరిచయం చేయాల్సింది రాఘవేంద్రరావు కాదట.. తేజ అట.

ఎన్నడూ బయటికి రాని ఈ విషయాన్ని ‘మదర్స్ డే’ సందర్భంగా బన్నీతో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతడి తల్లి నిర్మల వెల్లడించడం విశేషం. తేజ బన్నీని హీరోగా పరిచయం చేసేలా ఒప్పందం కుదిరి.. అంతా ఓకే అనుకున్నాక ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందట. అప్పుడు బన్నీ బాగా డిజప్పాయింట్ అయితే ధైర్యం చెప్పినట్లుగా ఆమె వెల్లడించింది. బన్నీ హీరో కావాలనుకున్న సమయానికి తేజ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ‘చిత్రం’ లాంటి సెన్సేషనల్‌ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన తేజ.. ఆ తర్వాత ‘నువ్వు నేను’, ‘జయం’ సినిమాలతో తిరుగులేని ఇమేజ్ సంపాదించాడు. ఆ టైంలోనే బన్నీని ఆయన ద్వారా హీరోగా పరిచయం చేయడానికి ప్రయత్నాలు జరిగినట్లున్నాయి. మరి ఈ కాంబినేషన్ ఎందుకు వర్కవుట్ కాలేదో ఏమో మరి. తేజ చేతుల మీదుగా బన్నీ పరిచయం అయి ఉంటే అతడి కెరీర్ ఎలా ఉండేదో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు