అల్లు శిరీష్ పెద్ద ఛాన్స్ కొట్టేశాడు

అల్లు శిరీష్ పెద్ద ఛాన్స్ కొట్టేశాడు

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో మెజారిటీ నిలదొక్కుకున్నారు. కానీ అల్లు శిరీష్ మాత్రం ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయాడు. హీరోగా నిలదొక్కుకోవాలని చాలా ఏళ్ల నుంచి పోరాడుతున్నాడు అరవింద్ చిన్న కొడుకు. తొలి రెండు సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్నాక ‘శ్రీరస్తు శుభమస్తు’ అతడికి ఊరటనిచ్చింది. ఈ విజయాన్ని పునాదిగా చేసుకుని ఎదుగుతాడనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. శిరీష్ కొత్త సినిమా ‘ఒక్క క్షణం’ అట్టర్ ఫ్లాప్ అయింది. శిరీష్ తిరిగి పూర్వపు స్థితికి వెళ్లిపోయాడు. త్వరలోనే మలయాళ సినిమా ‘ఏబీసీడీ’ రీమేక్‌లో నటించబోతున్నాడతను. ఆ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు శిరీష్. ఐతే ఆ సినిమా మొదలు కాకముందే శిరీష్‌ ఊహించని విధంగా ఒక భారీ తమిళ సినిమాలో చోటు దక్కించుకోవడం విశేషం.

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా.. అతడితో ఇంతకుముందు ‘వీడొక్కడే’, ‘బ్రదర్స్’ సినిమాలు తీసిన కె.వి.ఆనంద్ ఓ చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘2.0’ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రెండు రోజుల కిందటే ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నట్లు అనౌన్స్ చేయడం ఆసక్తి రేకెత్తించింది. ఇప్పుడు ఈ చిత్రంలో శిరీష్ కూడా ఒక పాత్ర చేయబోతున్నట్లు లైకా వాళ్లు ప్రకటించారు. సూర్యతో కలిసి శిరీష్ ఉన్న ఒక ఫొటోను కూడా విడుదల చేశారు. ఇలాంటి మెగా ప్రాజెక్టులో శిరీష్‌కు చోటు దక్కడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే అల్లు అరవింద్‌తో సూర్యకు మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో ఆయన రెకమండేషన్  మేరకే చిన్న కొడుక్కి ఛాన్సిచ్చినట్లున్నారు. శిరీష్ గత ఏడాది మలయాళంలో ‘1971’ అనే యుద్ధ నేపథ్యం ఉన్న సినిమా చేసిన సంగతి తెలిసిందే. అందులోనూ మోహన్ లాల్ హీరోగా నటించాడు. ఇప్పుడు మరోసారి శిరీష్-లాల్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. ‘1971’లో శిరీష్‌కు ఛాన్స్ దక్కడంలో అతడి అన్నయ్య అల్లు అర్జున్ కీలక పాత్ర పోషిస్తే.. ఇప్పుడు సూర్య సినిమా ఛాన్స్ తండ్రి అరవింద్ ఇప్పించినట్లున్నాడు. మరి ఈ అవకాశాల్ని శిరీష్ ఏమాత్రం సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు