ఇక్కడ హ్యాట్రిక్ అవుతుందా సమంత?

ఇక్కడ హ్యాట్రిక్ అవుతుందా సమంత?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు టైం తెగ కలిసొస్తోంది. వరస హిట్లతో దూసుకుపోతోంది. సాధారణంగా పెళ్లయ్యాక హీరోయిన్లకు క్రేజ్ తగ్గుతుంది. కానీ సమంత మాత్రం నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక కెరీర్ ద బెస్ట్ అనిపించుకునే రెండు పాత్రలతో అందరినీ మెప్పించింది. రంగస్థలంలో పల్లెటూరి అమ్మాయి రామలక్ష్మి పాత్రలో.. మహానటిలో జర్నలిస్ట్ మధురవాణి పాత్రలోనూ అదరగొట్టేసింది.

రంగస్థలం.. మహానటి సినిమాలతో సమంత ఖాతాలో రెండు హిట్లు పడిపోయాయి. ఇంకో హిట్ పడితే హ్యాట్రిక్ కొట్టినట్టే. విశాల్ హీరోగా తమిళంలో తీసిన ఇరుంబు తిరయ్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తమిళ వర్షన్ ఇరుంబి తిరయ్ లో అమ్మడు డాక్టర్ రతీదేవిగా ఇరగదీసిందని రివ్యూలు రావడంతో.. సమంత కూడా హ్యాట్రిక్ కొట్టేశానంటూ ఎక్సయిట్ అయ్యింది. బాగానే ఉంది. మరి ఈ హ్యాట్రిక్ తెలుగులో కూడా కొట్టినట్లే అనుకోవాలా? ఈ మూవీ నిజానికి సంక్రాంతి నాటికే థియేటర్లకు రావాల్సి ఉంది. కానీ రకరకాల కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఈ మూవీని తెలుగులో అభిమన్యుడు పేరుతో డబ్ చేస్తున్నారు. ఈ మూవీ కనుక బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే సమంత అభిమానులు  కోరుకున్న 'తెలుగు' హ్యాట్రిక్ ఆమె సొంతమవుతుంది.

ఒకప్పుడు విశాల్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉండేది. సినిమా యావరేజ్ గా ఉన్నా కలెక్షన్లు ఫుల్ గా ఉండేవి. వరస ఫ్లాపులతో విశాల్ కు క్రేజ్ తగ్గింది. దాంతో తమిళంలో సూపర్ హిట్ అవుతున్న సినిమాలు ఇక్కడ యావరేజ్ గానూ ఆడట్లేదు. ఆ మధ్యన వచ్చిన డిటెక్టివ్ సినిమానే అందుకు ఉదాహరణ. మరి ఇలాంటప్పుడు అభిమాన్యుడు ఇక్కడ ఎంతవరకు మెప్పిస్తాడనేది డౌటే. ఈ మూవీకి కూడా లక్ కలిసొస్తుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు