మే 14న ల్యాపుటాపులో 'రంగస్థలం'

మే 14న ల్యాపుటాపులో 'రంగస్థలం'

రంగ‌స్థ‌లం సినిమా మంచి విజ‌యాన్నే మూట‌గ‌ట్టుకుంది. పలానా సీన్ బాలేదండీ అని చెప్ప‌డానికి వీల్లేకుండా ప్ర‌తి సీన్ ప్రేక్ష‌కుడికి న‌చ్చేలా తీశాడు ద‌ర్శ‌కుడు. ఇక చిట్టిబాబు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. రామ‌ల‌క్ష్మి అద‌ర‌గొట్టేసింది. అస‌లు పాట‌లే ఆ సినిమాకు పెద్ద ఆస్తేమో అన్న‌ట్టు కంపోజ్ చేశాడు దేవిశ్రీ ప్ర‌సాద్‌. ప్రెసిడెంటుగారు పిచ్చెక్కించారు. కుమార్ బాబు భలే చేశాడు. రంగ‌మ్మ‌త్త కూడా అంద‌రికీ తెగ‌న‌చ్చేసింది. ఇలా రంగ‌స్థ‌లం గురించి చెప్ప‌మంటే ఎవ‌రైనా ఆగ‌కుండా చెప్పుకుంటూ పోతారు. అలాంటి సినిమాకు ఏం తొంద‌ర వ‌చ్చింద‌ని... అప్పుడే అమెజాన్ ప్రైమ్‌లో వేసేస్తున్నారు?

మార్చి 30న విడుద‌లైంది రంగ‌స్థ‌లం. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. అప్ప‌ట్నించి ఇప్ప‌టివ‌ర‌కు ఇంకా చాలా చోట్ల కొన్ని థియేట‌ర్ల‌లో ఆడుతూనే ఉంది. రంగ‌స్థ‌లం త‌రువాత విడుద‌లైన భ‌ర‌త్ అను నేను  నా పేరు సూర్య సినిమాలు విడుద‌ల‌య్యాయి. వాటి క‌లెక్ష‌న్లు త‌గ్గాయి కానీ రంగ‌స్థ‌లం మాత్రం ఇంకా క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఆ సినిమాను త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌సారం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది అమెజాన్‌. మే 14 ఆ సినిమా అమెజాన్‌లో విడుద‌ల కానుంది. అస‌లే ఒక ప‌క్క క‌లెక్ష‌న్లు రాబడుతుంటే ఇలా అమెజాన్ ప్రైమ్ లో వేయ‌డం అంత అవ‌స‌ర‌మా అని భావిస్తున్నారు సినిమా లవ్వర్స్. రంగ‌స్థ‌లం సినిమా తెలుగు జ‌నాల‌కు పిచ్చిపిచ్చిగా న‌చ్చేసింద‌ని వేరే చెప్ప‌క్క‌ర్లేదు. థియేట‌ర్ల‌లోనే రెండు మూడు సార్లు సినిమా చూసిన వాళ్లు ఉన్నారు. ఇంకా జ‌నాల‌ను థియేట‌ర్‌కు వ‌స్తున్న‌ప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌సారాన్ని కొన్ని రోజులు ఆపితేనే బాగుంటుందేమో.

ముందుగా చేసుకున్న ఒప్పందం ప్ర‌కార‌మే అమెజాన్‌కు సినిమా హ‌క్కుల‌ను అమ్మి ఉంటారు కాబ‌ట్టి... ఆప‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయాలు వెలువ‌డుతున్నాయి. కొన్ని కోట్ల రూపాయ‌లిచ్చి కొనుక్కున్న అమెజాన్‌కు నాలుగు డ‌బ్బులు రావాలంటే ఇలాంటి స‌మ‌యంలోనే సినిమాను ప్ర‌సారం చేసుకోవాలి క‌దా అంటున్నారు మ‌రికొంద‌రు త‌ల‌పండిన సినీ జ‌నాలు. సో మే 14న మీ ల్యాపుటాపుల్లో మరోసారి రంగస్థలం చూస్కోండి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు