ఖాళీ ఉన్నది వద్దంట.. పోటీయే ముద్దంట

ఖాళీ ఉన్నది వద్దంట.. పోటీయే ముద్దంట

అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్లుంటుంది తెలుగు సినిమాల రిలీజ్ వ్యవహారం. ఒక్కో వారం మూణ్నాలుగు సినిమాలు.. అరడజను.. పది సినిమాల దాకా కూడా రిలీజ్ చేసేస్తారు. కొన్నిసార్లు ఒక్కో వారాన్ని ఖాళీగా వదిలేస్తారు. ఈ వారాంతంలో రెండు సినిమాలు బరిలో నిలిచాయి. కానీ వచ్చే వారానికి అసలు ఏ సినిమా రిలీజయ్యేలా కనిపించడం లేదు. మే 18 కోసం ఇంతకుముందు రెండు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. ఐతే గోపీచంద్ సినిమా ‘పంతం’ షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వాయిదా పడింది. ఆ తేదీకి పక్కా అనుకున్న ‘టాక్సీవాలా’కు పోస్ట్ ప్రొడక్షన్‌లో ఏదో తేడా వచ్చి అనూహ్యంగా వెనక్కి వెళ్లిపోయింది. ఈ సినిమా ఆ తేదీకి రాదని వారం కిందటే తేలిపోయింది. అయినప్పటికీ ఆ వీకెండ్ కోసం వేరే సినిమాలేవీ పోటీ పడట్లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘నా నువ్వే’ కానీ.. నాగశౌర్య చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’ కానీ 18న రావచ్చని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు.

డబ్బింగ్ సినిమాలు ‘కాశి’.. ‘డెడ్ పూల్-2’ మాత్రమే నామమాత్రంగా రిలీజయ్యేలా కనిపిస్తున్నాయి వచ్చే వారాంతంలో. ఐతే ఈ వారాన్ని ఇలా వదిలేసి తర్వాతి వీకెండ్ కోసం మాత్రం తెగ పోటీ పడిపోతున్నారు. ఒకటికి మూడు సినిమాలు అదే రోజు రాబోతున్నాయి. ఆ తేదీకి ముందుగా రిలీజ్ డేట్ ఖాయం చేసుకున్న సినిమా ‘ఆఫీసర్’.. లేటుగా రేసులోకి వచ్చిన ‘నేల టిక్కెట్టు’.. ‘నా నువ్వే’.. మూడూ కూడా మే 25 విషయంలో వెనక్కి తగ్గట్లేదు. ముందుకు రావడానికి కానీ.. వెనక్కి వెళ్లడానికి కానీ ఆసక్తి చూపించట్లేదు. ఇలా త్రిముఖ పోటీకి దిగడం వల్ల ఆయా సినిమాలకే చేటు. అయినా మూడు చిత్రాల బృందాలూ పట్టుదలతో ఉన్నాయి. వీటిలో ఒక్కటైనా ముందు వారం వస్తే కొంచెం బ్యాలెన్స్ అయ్యేది. కానీ ప్రస్తుతం ‘మహానటి’ ప్రభంజనం సాగుతున్న నేపథ్యంలో 18వ తేదీకి సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతున్నట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు