విశాల్‌కు లవరే విలన్

విశాల్‌కు లవరే విలన్

తెలుగువాడైన తమిళ హీరో విశాల్‌కు తమిళంలో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగానే ఉంది. గత కొన్నేళ్లలో విభిన్నమైన.. జనరంజకమైన సినిమాలతో విశాల్ తన రేంజ్ పెంచుకున్నాడు. శుక్రవారం రిలీజైన అతడి కొత్త సినిమా ‘ఇరుంబు తురై’కి కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. తమిళంలో సమ్మె తర్వాత వచ్చిన పెద్ద సినిమా కావడంతో దీనికి ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి.

విశేషం ఏంటంటే ఈ సినిమా రిలీజైన రోజే విశాల్ కొత్త చిత్రం ‘సెండైకోళి-2’ ట్రైలర్ లాంచ్ అయింది. విశాల్‌కు హీరోగా గుర్తింపు తెచ్చి.. మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన ‘సెండైకోళి’ (తెలుగులో పందెం కోడి)కి ఇది సీక్వెల్. దీని ఒరిజినల్ తీసిన లింగుస్వామే సీక్వెల్ కూడా డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ చూస్తే ‘సెండైకోళి’తో పోలిస్తే ఇది మరింత మాస్ గా.. పెద్ద స్థాయిలో ఉంటుందని అర్థమవుతోంది.

తమిళ నేటివిటీ ఛాయలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ కమర్షియల్ హంగులకు.. మాస్ అంశాలకు మాత్రం కొదవ లేనట్లే కనిపిస్తోంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విశాల్ తండ్రి పాత్రలో రాజ్ కిరణ్ (పందెం కోడిలో చేశారు) కొనసాగనున్నాడు. విశేషం ఏంటంటే ఈ చిత్రం విశాల్ నిజ జీవిత ప్రేయసిగా అందరూ చెప్పుకునే వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్ర ‘పొగరు’లోని శ్రియారెడ్డి పాత్రను గుర్తుకు తెస్తోంది.

ప్రస్తుతం వరలక్ష్మితో విశాల్‌కు ఎలాంటి బంధం ఉందో కానీ.. తెరమీద వీళ్లిద్దరినీ హీరో-విలన్ పాత్రలో చూడబోతుండటం మాత్రం తమిళ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. మరి వీళ్ల కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి. కోలీవుడ్లో సమ్మె లేకుంటే ‘సెండైకోళి-2’ ఈ పాటికే విడుదల కావాల్సిందే. ఐతే సమ్మె వల్ల ‘ఇరుంబుతురై’ లేటుగా రిలీజవడంతో దీన్ని ఇంకో రెండు నెలల తర్వాత రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు