మ‌హాన‌టి ఎలా ఉందంటూ త‌మ్ముళ్ల‌తో బాబు ఆరా!

మ‌హాన‌టి ఎలా ఉందంటూ త‌మ్ముళ్ల‌తో బాబు ఆరా!

తెలుగు ప్ర‌జ‌ల్ని మ‌హాన‌టి ఫీవ‌ర్ ఎంత‌గా ప‌ట్టేసింద‌న్న‌ది ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అప్పుడెప్పుడో వెండితెర‌పై మెరుపులు మెరిపించిన ఒక న‌టి బ‌యోపిక్ విడుద‌లై ఇంత భారీగా స‌క్సెస్ కావ‌టం ఒక ఎత్తు అయితే.. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి సైతం మ‌హాన‌టి సినిమా ఎలా ఉందంటూ ఆరా తీయ‌టం చూసిన‌ప్పుడు సావిత్రి ఫీవ‌ర్ తెలుగు ప్ర‌జ‌ల్లో ఎంత ఎక్కువ‌గా ఉందో ఇట్టే అర్థం కాక మాన‌దు.

వివిధ అంశాల‌పై పార్టీ నేత‌ల‌తో రివ్యూ పెట్టుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. చ‌ర్చ‌ల సంద‌ర్భంగా సినిమాల గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా మ‌హాన‌టి సినిమా టాక్ గురించి ఆరా తీశారుచంద్ర‌బాబు. మ‌హాన‌టి సినిమా బాగుంద‌ని త‌న‌కు ఎవ‌రో చెప్పార‌ని.. సినిమా ఎలా ఉంద‌ని స‌భ్యుల్ని బాబు ప్ర‌శ్నించారు.

దానికి ప‌లువురు సినిమా చాలా బాగుంద‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌హాన‌టి సినిమా ప్ర‌స్తావ‌న ముందు ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్ర‌స్తావ‌న‌ను టీడీపీ ఎంపీ.. సీనియ‌ర్ న‌టుడు ముర‌ళీమోహ‌న్ తీసుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ స్క్రిప్ట్ తాను విన్న‌ట్లు ముర‌ళీమోహ‌న్ వెల్ల‌డించారు.

ముఖ్య‌మంత్రిగా ఎన్టీఆర్ ప్ర‌మాణ‌స్వీకారం చేసే వ‌ర‌కే మొద‌టిభాగం ఉంటుంద‌ని చెప్పారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ జ‌న‌వ‌రిలో విడుద‌ల అయితే బాగుంటుంద‌న్న మాట‌ను ముర‌ళీమోహ‌న్ చెప్పారు. ఈ సంద‌ర్భంలోనే మ‌హాన‌టి ప్ర‌స్తావ‌న‌ను సీఎం చంద్ర‌బాబు తీసుకురావ‌టం గ‌మ‌నార్హం. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి నిర్వ‌హించిన పార్టీ స‌మావేశంలో ఒక సినిమా ప్ర‌స్తావ‌న రావ‌టం చూస్తే.. మ‌హాన‌టి ఫీవ‌ర్ తెలుగు రాష్ట్రాల్ని ఎంత‌గా ఊపేస్తుందో ఇట్టే అర్థం కాక మాన‌దు. సావిత్రా.. మ‌జాకానా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు