రాజుగారి క్రెడిబిలిటీ.. హుష్ కాకి

రాజుగారి క్రెడిబిలిటీ.. హుష్ కాకి

దిల్ రాజును తెలుగు సినీ పరిశ్రమలో జడ్జిమెంట్ కింగ్‌గా అభివర్ణిస్తారు. ఆయన ఒక సినిమా నిర్మించినా.. ఏదైనా సినిమా హక్కులు కొని తన బేనర్లో రిలీజ్ చేసినా ఒక నమ్మకంతో థియేటర్లకు వెళ్తారు. మధ్యలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఇంకా ఆయన క్రెడిబిలిటీని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఐతే ఈ మధ్య రాజు చాలా భరోసాతో సానుకూలంగా మాట్లాడుతున్న సినిమాలు తేడా కొట్టేస్తున్నాయి. గత నెలలో నాని సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాను హోల్ సేల్‌గా కొనేసి తన బేనర్లో రిలీజ్ చేశాడు రాజు. ఆ సినిమా గురించి చాలా పాజిటివ్‌గా చెప్పాడు. దాని ఫలితమేంటో తెలిసిందే. ఇక తాజాగా ‘మెహబూబా’ గురించి రాజు ఏం చెప్పాడో తెలిసిందే.

పూరి ఈజ్ బ్యాక్ అని.. మనసు పెట్టి కథ రాసి సినిమా తీశాడని.. చాలా గొప్పగా మాట్లాడాడు ఈ సినిమా గురించి. ఆ సందర్భంగా మధ్యలో తన జడ్జిమెంట్ తేడా రావడం గురించి చెబుతూ.. జనాల నమ్మకం పోకుండా జాగ్రత్త పడుతున్నట్లు కూడా చెప్పాడు. కానీ శుక్రవారం ‘మెహబూబా’ చూసిన వాళ్లందరూ షాకవుతున్నారు. ఇటు విమర్శకులు.. అటు ప్రేక్షకులు ఈ సినిమా చూసి పెదవి విరుస్తున్నారు. పూరి మీద ముందు నుంచి నమ్మకాల్లేవు కానీ.. రాజు చెప్పడంతో జనాలకు నమ్మకమొచ్చింది. కానీ సినిమా చూస్తే అందరిలోనూ నిట్టూర్పులే. దీంతో అంతన్నాడింతన్నాడే రాజు గారు అంటూ ఆయన్ని తిట్టిపోస్తున్నారు. ఇలాంటి సినిమా రాజుకు అంతలా ఎలా నచ్చేసింది.. ఆయన జడ్జిమెంట్ ఇలా తయారైందేంటి అని విమర్శలు గుప్పిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు