పవన్-రవితేజ.. ఒక ‘సిగ్గులేని’ కామెంట్

పవన్-రవితేజ.. ఒక ‘సిగ్గులేని’ కామెంట్

మాస్ రాజా రవితేజ మెగాస్టార్ చిరంజీవికి బాగా క్లోజ్. తన కెరీర్ ఎదుగుదలలో చిరంజీవి పాత్ర గురించి ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. ఐతే చిరంజీవి తమ్ముడు పవన్‌తో రవితేజ ఎప్పుడూ పెద్దగా కనిపించింది లేదు. ఒకరి గురించి ఒకరు మాట్లాడిందీ లేదు. ఇలాంటి నేపథ్యంలో మాస్ రాజా కొత్త సినిమా ‘నేలటిక్కెట్టు’ ఆడియో వేడుకకు పవన్ రావడం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది.
మరి ఈ వేడుకలో ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడతారా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ వేడుకలో ముందు రవితేజ మాట్లాడుతూ.. పవన్ చాలా ఏళ్ల కిందట తనకు ఫోన్ చేసిన ఇచ్చిన ఒక విచిత్రమైన కాంప్లిమెంట్ గురించి వెల్లడించాడు. ‘మీరు అంత సిగ్గు లేకుండా ఎలా నటిస్తారండీ’ అని పవన్ రవితేజతో అన్నాడట. తన జీవితంలో అదే అత్యుత్తమ కామెంట్ అని మాస్ రాజా చెప్పడం విశేషం.

తర్వాత పవన్ మాట్లాడుతూ ఈ కామెంట్ మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తనకు కెమెరా ముందు నటించడం చాలా సిగ్గని.. చుట్టూ జనాలుంటే కంగారు పడిపోతానని.. కొన్నిసార్లు పారిపోతుంటానని.. కానీ రవితేజ మాత్రం చుట్టూ ఎందరున్నా ఏ బెరుకూ లేకుండా ధైర్యంగా నటిస్తాడని.. ఏ పట్టింపులూ ఉండవని.. అందుకే అప్పుడు అలా అన్నానని చెప్పాడు. మొత్తానికి మాస్ రాజా ఆ కామెంట్ చేసినపుడు.. పవన్ దీనిపై వివరణ ఇచ్చినపుడు జనాల్లో ఆసక్తి రేగింది.

ఈ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. ఐతే ఈ వేడుకకు పవన్ వచ్చింది రవితేజ కోసం మాత్రం కాదు. ఈ చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి పవన్‌కు గత కొన్నేళ్లలో చాలా సన్నిహితుడయ్యాడు. ప్రస్తుతం జనసేన పార్టీకి రామ్ ఆర్థిక సహకారాలు అందిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే రామ్ తనకెంత ఆప్తుడో పవన్ ఈ వేడుకలో వివరించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు