శిష్యుడిని చూసి కమ్ముల కాలర్ ఎగరేయొచ్చు

శిష్యుడిని చూసి కమ్ముల కాలర్ ఎగరేయొచ్చు

ఒక శిష్యుడి నుంచి గురువు ఏదీ ఆశించడు.. అతను ప్రయోజకుడై పేరు తెచ్చుకుంటే అదే ఆ గురువుకు ఇచ్చే అతి పెద్ద గురుదక్షిణ అంటారు. ఈ రకంగా చూస్తే యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తన గురువు శేఖర్ కమ్ములకు ‘మహానటి’ రూపంలో అద్భుతమైన కానుక ఇచ్చినట్లే. నాగ్ అశ్విన్ తన శిష్యుడని కమ్ముల చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. కమ్ముల స్కూల్ నుంచి ఇప్పటికే కొందరు దర్శకులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. వారిలో అనీష్ కురువిల్లా ఒకడు. కమ్ముల తొలి సినిమా ‘ఆనంద్’లో ఒక పాత్ర కూడా చేసిన అనీష్.. ఆ తర్వాత దర్శకుడిగా మారి ‘ఆవకాయ్ బిర్యానీ’ తీశాడు. ఈ చిత్రానికి కమ్ముల నిర్మాత కూడా. కానీ ఆ చిత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆపై అతను తీసిన ‘కో అంటే కోటి’ కూడా ఫ్లాపే అయింది. కమ్ముల మరో శిష్యుడు సాయికిరణ్ అడివి ‘వినాయకుడు’తో సత్తా చాటుకున్నప్పటికీ ఆ తర్వాత అంచనాల్ని అందుకోలేకపోయాడు.

ఇక నాగ్ అశ్విన్ విషయానికొస్తే అతడిని చూస్తే కమ్ములను చూస్తున్నట్లే ఉంటుంది. ఆహార్యంలో చాలా వరకు గురువునే తలపిస్తాడు. కానీ సినిమాల విషయంలో మాత్రం గురువును అనుకరించకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన దారిని వేసుకున్నాడు నాగ్. అతడి తొలి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’ ప్రత్యేకమైన చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడిగా అతడి పరిణతిని తెలియజేసింది. ఇప్పుడు ‘మహానటి’తో ఒకేసారి ఎన్నో మెట్లు ఎక్కేశాడు అశ్విన్. ఒక సినిమా అనుభవమున్న దర్శకుడి నుంచి ఇలాంటి గొప్ప సినిమాను ఎవ్వరూ ఊహించలేదు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటనదగ్గ సినిమా అందించిన అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలోనే ఇతను కమ్ముల శిష్యుడనే విషయాన్ని కూడా గుర్తిస్తున్నారు. ఈ చిత్ర విడుదలకు ముందు నాగ్ అశ్విన్.. తన గురువు గురించి గొప్పగా మాట్లాడటం విశేషం. ‘మహానటి’కి కాస్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నైపుణ్యం తన గురువు నుంచే నేర్చుుకున్నానని అతనన్నాడు. కమ్ముల లాగే చాలా సింపుల్‌గా, హంబుల్‌గా ఉంటూ అన్ని రకాలుగా తాను గురువుకు తగ్గ శిష్యుడినే అనిపిస్తున్నాడు నాగ్ అశ్విన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు