‘మహానటి’కి సుక్కు మార్కు ప్రశంసలు

‘మహానటి’కి సుక్కు మార్కు ప్రశంసలు

మహానటి.. ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. ఈ సినిమా విషయంలో సామాన్యులే కాక సినీ జనాలు కూడా చాలా ఉద్వేగంతో స్పందిస్తున్నారు. పలువురు దర్శకులు.. నిర్మాతలు.. నటీనటులు ఈ సినిమా ఒక అద్భుతం అంటూ కొనియాడారు. ఈ జాబితాలోకి విలక్షణ దర్శకుడు సుకుమార్ కూడా చేరాడు. ఎంత పెద్ద దర్శకుడు అయినప్పటికీ చిన్న స్థాయి వాళ్ల ప్రతిభను గుర్తించి పొగడ్డానికి సుకుమార్ ఎప్పుడూ ముందుంటాడు. అతడి ప్రశంసలు మనసు లోతుల్లోంచి వచ్చినట్లే ఉంటాయి. ‘మహానటి’ విషయంలోనూ సుకుమార్ అదే తరహాలో.. తన విలక్షణతను కూడా జోడించి ప్రశంసలు అందించాడు.

‘మహానటి’ సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వచ్చాక అశ్విన్‌తో మాట్లాడదామని ఫోన్ ట్రై చేస్తుంటే ఒక పెద్దావిడ సుకుమార్ దగ్గరికి వచ్చిందట. మీరు డైరెక్టరా అని అడిగిందట. అవును అనంగానే గట్టిగా పట్టుకుని ఏడ్చేసిందట. మా సావిత్రమ్మను ఎంత బాగా చూపించావయ్యా అంటూ సుకుమార్‌ను పొగిడిందట. తన కళ్లలో నీళ్లు వచ్చాయని.. తాను అశ్విన్ కాదని ఆవిడకు చెప్పలేకపోయానని.. ఆమె ప్రేమంతా తానే తీసుకున్నానని సుకుమార్ చెప్పాడు. ఆమె దీవెనలు అందుకుని కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయానంటూ అశ్విన్‌ను ఉద్దేశించి అన్నాడు సుకుమార్. ఇంతకంటే తాను సినిమా గురించి ఏమీ చెప్పలేనంటూ.. ఇట్లు సుకుమార్ అని బ్రాకెట్లో కొన్ని క్షణాల అశ్విన్ అని పేర్కొన్నాడు సుకుమార్. సినిమా గురించి ఏమీ చెప్పకుండా ఈ అనుభవం గురించి చెప్పడం ద్వారా సుకుమార్ తన విలక్షణతను చాటుకున్నాడు. సుక్కు రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు