వర్మ ప్రభావం.. ఆశ్చర్యమెందుకు?

వర్మ ప్రభావం.. ఆశ్చర్యమెందుకు?

రామ్ గోపాల్ వర్మ లేకపోతే నేను లేను.. ఇటీవలే ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో టాపర్లలో ఒకడిగా నిలిచిన తెలుగు కుర్రాడు యడవెల్లి అక్షయ్ అన్న మాట ఇది. ఈ మాట చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్న మెజారిటీ జనాలు ఈ మాటను జీర్ణించుకోలేకపోయారు. వర్మ ఏంటి.. సివిల్స్ టాపర్‌కు స్ఫూర్తినివ్వడమేంటి అని షాకయ్యారు. నిజానికి అక్షయ్‌ను ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి కూడా అలాగే షాకైంది. వర్మేంటి.. మీకు ఇన్‌స్పిరేషనేంటి అని. ఐతే అక్షయ్ చెప్పిన ఆన్సర్.. అతడి కోణాన్ని బట్టి చూస్తే వర్మ అతడిని ఇన్‌స్పైర్ చేయడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. వర్మ ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేయొచ్చు గాక.. ఎవరినో ఒకరిని గిచ్చుతూ ఉండొచ్చు గాక.. కానీ అతనొక మేధావి అనే విషయం అంగీకరించాల్సిందే. దేశంలో అంతటి ఫేమ్ ఉండి అంత లాజికల్‌గా మాట్లాడే వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. చిన్న వయసులోనే అయాన్ రాండ్ ఫిలాసఫర్లను కాచి వడబోసేసిన వర్మ.. ఏ విషయంలో అయినా తన అభిప్రాయాన్ని చెప్పే తీరు.. వాదించే వైనం చూస్తే అవతలి వ్యక్తికి మాటలు రావు. ఒక చర్చ లేదా వాదన అంటూ మొదలుపెడితే వర్మను గెలవడం చాలా కష్టం.

మెజారిటీ జనాలు వ్యతిరేకించే విషయాన్ని కూడా వర్మ చాలా కన్విన్సింగ్‌గా చెప్పగలడు. తనను వ్యతిరేకించే వాళ్లను కూడా ఏ ఇష్యూలో అయినా ఒప్పించగలడు. అందరూ ఆలోచించేదానికి పూర్తి భిన్నంగా ఉంటుంది వర్మ ఆలోచన విధానం. అక్షయ్ చెప్పింది కూడా అదే. పది మంది ఒకలా ఆలోచిస్తే, మాట్లాడితే.. వర్మ మరోలా ఆలోచించి, మాట్లాడతాడని.. అదే సమయంలో అతడి ఆలోచన ఎడ్డెం అంటే తెడ్డం అన్నట్లుగా కాకుండా చాలా లాజికల్‌గా, కన్విన్సింగ్‌గా ఉంటుందని చెప్పాడు. తనతో పాటు తన స్నేహితులు ఐదుమందిని కూడా వర్మ పిచ్చోళ్లను చేసినట్లు చెప్పాడు. అలాగే వర్మ సినిమాలు చూడ్డం మానేసి ఆయన్ని చదవడం మొదలుపెట్టానని కూడా చెప్పాడు. ఇలా వర్మను సినిమాల నుంచి వేరు చేసి.. ఆయన ఆలోచన విధానాన్ని ఫాలో అవుతూ డైహార్డ్ ఫ్యాన్స్‌గా మారిన వాళ్లు లెక్కలేనంత మంది ఉన్న మాట వాస్తవం. ఆయనతో ముడిపడ్డ వివాదాలు, సినిమాల సంగతుల్ని పక్కన పెట్టేస్తే ఈ తరహాలో వర్మను అభిమానించే వాళ్లకు లోటు లేదు. కాబట్టి సివిల్స్ టాపర్‌కు వర్మ స్ఫూర్తా అంటూ షాకవ్వాల్సిన పని లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు