వైజయంతీ మూవీస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

వైజయంతీ మూవీస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

వైజయంతీ మూవీస్.. తెలుగు సినీ చరిత్రలో ఘనమైన, సుదీర్ఘ ప్రస్థానం ఉన్న బేనర్లలో ఒకటి. నలభై ఏళ్లకు పైగా సినీ నిర్మాణంలో ఉన్న ఈ సంస్థ నుంచి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సహా ఎన్నెన్నో బ్లాక్ బస్టర్లు వచ్చాయి. ఆ సంస్థ ప్రతిష్టను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇంతటి ఘన ప్రస్థానం ఉన్న ఆ సంస్థకు గత దశాబ్దంన్నరలో ఏమాత్రం కలిసి రాలేదు. జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన ‘కంత్రి’, ‘శక్తి’ సినిమాలు ఆ సంస్థను దారుణంగా దెబ్బ తీశాయి. ముఖ్యంగా దశాబ్దం కిందటే 50 కోట్ల దాకా బడ్జెట్ పెట్టి తీసిన ‘శక్తి’ వైజయంతీ మూవీస్‌ను కుదేలు చేశాయి. రజినీకాంత్‌తో తీసిన ‘కథానాయకుడు’ మరో దెబ్బ. ఇంకోవైపు అశ్వినీదత్ కూతుళ్లు నిర్మాతలుగా మారి తీసిన ‘బాణం’.. ‘ఓం శాంతి’.. ‘సారొచ్చారు’.. సినిమాలూ ఆర్థికంగా మంచి ఫలితాలనివ్వలేదు.  చివరగా దత్ కూతుళ్లు తీసిన ‘ఎవడే సుబ్రమణ్యం’ కాస్త సానుకూల ఫలితాన్నందుకుంది. దానికి కూడా పెద్దగా లాభాలేమీ రాలేదు.

ఇలాంటి స్థితిలో అశ్వినీదత్, ఆయన కూతుళ్లు కలిసి ‘మహానటి’ లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును తలకెత్తుకున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత ప్రియాంక దత్‌ను పెళ్లి చేసుకున్న నాగ్ అశ్విన్‌ను నమ్మారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి.. ఏమాత్రం రాజీ లేకుండా సావిత్రి కథతో ‘మహానటి’ సినిమాను నిర్మించారు. ఫలితం గురించి ఆలోచించకుండా ఈ సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డారు. నిజాయితీగా సినిమా తీశారు. భారీ బడ్జెట్ పెట్టారు. సినిమాను అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. దానికి ఇప్పుడు మంచి ఫలితమే వస్తోంది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ‘మహానటి’కి పేరు వస్తోంది. కేవలం పేరు మాత్రమే కాదు.. వసూళ్లు కూడా బాగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత వైజయంతీ మూవీస్ పేరు మార్మోగుతోంది. ఆ సంస్థ ఖాతాలో పెద్ద విజయం కూడా పడబోతోంది. మొత్తానికి ఈ బేనర్‌కు ఇన్నాళ్లకు మంచి రోజులు వచ్చినందుకు ఇండస్ట్రీ అంతా కూడా సంతోషిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు