విజయ్.. దుల్కర్.. జెమిని.. కుర్చీలాట

విజయ్.. దుల్కర్.. జెమిని.. కుర్చీలాట

‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో ముందుగా విడుదలవుతున్నది ‘మహానటి’ చిత్రమే. సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్.. విజయ్ ఆంటోనీ అనే కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు.  సావిత్రి జీవితంపై పరిశోధన జరిపే మధురవాణి అనే సమంత పోషించిన పాత్రకు సాయం చేసే ప్రియుడి పాత్ర ఇది. సినిమాలో మిగతావన్నీ జనాలకు తెలిసిన పాత్రలు కాగా.. విజయ్, సమంతలవి మాత్రం కొత్త క్యారెక్టర్లు. వీటికి సినిమాలో ఏమాత్రం ప్రాధాన్యం ఉంటుంది.. ఇవి ఏమేరకు ఆకట్టుకుంటాయి అనే
సందేహాలు జనాల్లో ఉన్నాయి.

ముఖ్యంగా ‘అర్జున్ రెడ్డి’ లాంటి సెన్సేషనల్ మూవీ తర్వాత విజయ్ ఇలాంటి చిన్న పాత్ర చేశాడేంటి అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై విజయ్ స్పందించాడు. నిజానికి ‘మహానటి’లో ముందు తనకు ఆఫర్ చేసింది విజయ్ ఆంటోనీ పాత్ర కాదని అతను చెప్పాడు. దుల్కర్ సల్మాన్ చేసిన  జెమిని గణేశన్ పాత్రకే తనను దర్శకుడు నాగ్ అశ్విన్ అడిగాడన్నాడు.
ఐతే తాను ఆ పాత్ర చేయగలనా లేదా అన్న సందేహాలు కలిగాయని.. అలాగే ఈ పాత్ర కోసం ప్రిపేరవ్వడానికి నెల సమయం పట్టేట్లుండటంతో డేట్లు సర్దుబాటు చేయడమూ కష్టమే అనిపించిందని అతనన్నాడు. అయినప్పటికీ నో చెప్పకుండా జెమిని గణేశన్ సినిమాలు చూడటం మొదలుపెట్టానన్నాడు. ఐతే ముందు దుల్కర్ సల్మాన్ డేట్లు దొరక్కే తనను ఈ పాత్రకు అడిగారని.. కానీ అతను సర్దుబాటు చేసుకోవడంతో మూడు రోజుల తర్వాత నాగ్ అశ్విన్ ఫోన్ చేసి దుల్కర్ ఓకే అయ్యాడన్నాడని.. దీంతో తాను ఒకరకంగా ఊపిరి పీల్చుకున్నానని విజయ్ తెలిపాడు. ఆపై తనకు విజయ్ ఆంటోనీ అనే చిన్న పాత్ర ఇచ్చారని.. వైజయంతీ మూవీస్ సంస్థ కాబట్టే తాను చిన్నదైనప్పటికీ ఈ పాత్ర చేయడానికి అంగీకరించానని వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు