పూరికి ‘మహానటి’ టెన్షన్

పూరికి ‘మహానటి’ టెన్షన్

ఒకప్పుడు స్టార్ హీరోలందరూ పూరి జగన్నాథ్ కోసం క్యూ కట్టే పరస్థితి ఉండేది. పూరి దర్శకత్వంలో ఒక్క సినిమా చేస్తే చాలన్నట్లు ఉండేది చాలామంది హీరోల పరిస్థితి. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితి మారుతూ వచ్చింది. పూరి సినిమాల్లో క్వాలిటీ పడిపోయింది. క్వాంటిటీ మాత్రమే మిగిలింది. అంతకంతకూ పడిపోతూ వచ్చిన ఆయన స్థాయి ‘పైసా వసూల్’తో అ:థమ స్థాయికి చేరింది. ఇలాంటి తరుణంలో కొడుకు పూరి ఆకాశ్‌ను హీరోగా పెట్టి ‘మెహబూబా’ తీశాడాయన. ఈ చిత్రంపై మొదట్లో ఎవరికీ పెద్ద ఆసక్తి కలగలేదు కానీ.. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ చూశాక పరిస్థితి మారింది. అందులోనూ దిల్ రాజు ఈ సినిమా చూసి పొగడ్డం.. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ తాను తీసుకోవడంతో దీనికి క్రేజ్ వచ్చింది. కానీ ఈ చిత్ర విడుదలకు ముందు మాత్రం అనుకున్నంత హైప్ కనిపించట్లేదు.

నెల రోజుల వ్యవధిలో మూడు భారీ సినిమాలు రిలీజవడం.. ఈ వీకెండ్లో ‘మెహబూబా’ కంటే ముందు ‘మహానటి’ రిలీజవుతుండటం.. ఇప్పుడు అందరి ఫోకస్ దాని మీదే ఉండటం.. మరోవైపు ‘మెహబూబా’ ప్రమోషన్లు పూర్‌గా ఉండటం దానికి ప్రతికూలంగా మారింది. కొన్ని రోజులుగా దీని గురించి చర్చే లేదసలు. సోషల్ మీడియాలో రెండు మూడు రోజులుగా ‘మహానటి’ ప్రోమోలే హల్ చల్ చేస్తున్నాయి.ఈ సినిమా విడుదలైన మరుసటి రోజుకు కూడా ‘మెహబూబా’ మీదికి ఫోకస్ పోదేమో. ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందన్నది కూడా కీలకమే. కమర్షియల్ సక్సెస్ సంగతలా ఉంచితే ఇదొక క్లాసిక్‌లా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. మరి దీని ప్రభావం బాక్సాఫీస్ మీద ఎలా ఉంటుంది.. ఇది ‘మెహబూబా’ మీద ఏమేరకు ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడే ఏమీ చెప్పలేం.

తన కెరీర్‌కు, అలాగే కొడుకు కెరీర్‌కు ‘మెహబూబా’ చాలా కీలకం కావడంతో పూరి అయితే ‘మహానటి’ విషయంలో కొంచెం టెన్షన్‌గానే ఉన్నాడు. ఈ సినిమా టాక్ తన చిత్రాన్ని కమ్మేసే స్థాయిలో ఉండకూడదని కోరుకుంటున్నాడు. చూద్దాం మరి ఏమవుతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు