సంపూ.. 233.64 కోట్ల కలెక్షన్లు!

సంపూ.. 233.64 కోట్ల కలెక్షన్లు!

‘హృదయ కాలేయం’ సినిమాతో మెరుపులా మెరిశాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్. ఇలాంటి హీరోల్ని పెట్టి ఇలాంటి సినిమాలు కూడా తీయొచ్చా అనిపించింది ఆ సినిమా. డిఫరెంటుగా చేసిన ఆ ప్రయత్నం అనూహ్యంగా ఆకట్టుకుంది. సంపూర్ణేష్ బాబుకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. కొంత కాలం పాటు ఆ క్రేజ్‌ను బాగానే వాడుకున్నాడు. కానీ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. పోయినేడాది ‘బిగ్ బాస్’ షో నుంచి నిష్క్రమించినప్పటి నుంచి సంపూ అసలు వార్తల్లోనే లేడు.

అతను హీరోగా నటించిన ‘కొబ్బరి మట్ట’ సినిమా గురించైతే అందరూ మరిచిపోయారు. ఎప్పుడో నాలుగేళ్ల కిందట మొదలైన సినిమా ఇది. మొదలైనపుడు మంచి క్రేజే ఉండేది కానీ.. ఆ సినిమాను పూర్తి చేయడంలో ఆలస్యం చేసి ఆ క్రేజ్ మొత్తం పోయేలా చేసుకున్నారు. ఇక ఈ చిత్రం రిలీజ్ కాదని అనుకుంటుంటే ఇప్పుడు ఉన్నట్లుండి వార్తల్లోకొచ్చింది.

బుధవారం సంపూర్ణేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక కొత్త పోస్టర్ వదిలింది చిత్ర బృందం. ఈ పోస్టర్ మీద 233.64 కోట్లు అని పెద్దగా వేసి.. కింద ‘తొలి వారం గ్రాస్ వసూళ్ల అంచనా’ అని పేర్కొన్నారు. ఈ మధ్య పెద్ద సినిమాలకు రిలీజ్ తర్వాత ఇలాగే ఘనంగా వసూళ్ల వివరాలతో పోస్టర్లు వదులుతున్న సంగతి తెలిసిందే. సంపూ సినిమాలంటే స్పూఫులు..
పేరడీలు..సెటైర్ల మయం. ఈ  పోస్టర్ కూడా ఆ కోవలోనిదే. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటివి అవసరమే కానీ.. ఎప్పుడూ ఇవే చేస్తేనే జనాలకు మొహం మొత్తుతుంది.

అందుకేనేమో  ‘కొబ్బరి మట్ట’ ఎటూ కాకుండా పోయింది. ఈ పోస్టర్ మీద సమ్మర్ రిలీజ్ అని కూడా వేశారు. మరి ఇంకో నెల రోజుల్లో ముగిసిపోయే వేసవి సీజన్లో దీనికి చోటెక్కడ దొరుకుతుందో చూడాలి. రొనాల్డ్ రూపక్‌సన్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ‘హృదయకాలేయం’ దర్శకుడు స్టీఫెన్ శంకర్ నిర్మించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు