యంగ్ హీరో.. బిల్డప్ చూశారా?

యంగ్ హీరో.. బిల్డప్ చూశారా?

సోషల్ మీడియా యాక్టివ్ అయ్యాక ఇక్కడ హీరోల అభిమానుల పేరుతో కొందరు చేసే హంగామా మామూలుగా ఉండదు. హీరోల పీఆర్వోలే వెనుక ఉండి ఈ గ్రూపుల్ని మొబిలైజ్ చేస్తుంటారు. ఎవరో అనామకుల్లాగా.. అపరిచితుల్లాగా కనిపిస్తూనే.. ఆ హీరో మీద తెగ అభిమానం కురిపించేస్తుంటారు. ఆ హీరో సినిమాకు పాజిటివ్ బజ్ తేవడానికి ప్రయత్నిస్తుంటారు. సినిమా ఎంత చెత్తగా ఉన్నా ఆహా ఓహో అంటూ కీర్తిస్తుంటారు. సినిమాల రిలీజ్ లేని టైంలోనూ హీరోను కీర్తించడమే పనిగా పెట్టుకుంటారు.

ఆ హీరో నటించిన పాత సినిమాల్లోని సీన్లను షేర్ చేస్తూ అన్నా ఏం చేసినావే.. ఇరగ్గొట్టేసినావ్ అంటూ పొగిడేస్తుంటారు. ఇక హీరోల బర్త్ డే లాంటి అకేషన్లొస్తే వీళ్ల హంగామా మామూలుగా ఉండదు. తాజాగా తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమాలు చేస్తున్న ఒక యంగ్ హీరో పుట్టిన రోజు జరిగింది. ఈ సందర్భంగా జరిగిన హంగామా చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

ఆ హీరోకు మాస్ ఇమేజ్ లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ అంటూ చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. హీరోగా అతడి కెరీర్ చాలా దయనీయ స్థితిలో ఉంది. వరుస ఫ్లాపులతో పూర్తిగా మార్కెట్ కోల్పోయాడు. అలాంటి హీరో పుట్టిన రోజుకు అభిమానులందరూ కామన్ డీపీ పెట్టుకోవాలంటూ ఒక పిక్ షేర్ చేశారు పీఆర్వోలు. మిగతా పీఆర్వోలు కూడా ఈ విషయంలో సాయం పట్టారు. పెద్ద పెద్ద స్టార్ల పుట్టిన రోజులు వస్తే వాళ్లు నటించిన సినిమాల్లోంచి రకరకాల లుక్స్ తీసి ఒక స్పెషల్ పిక్ తయారు చేయడం.. అభిమానులు దాన్ని కామన్ డీపీగా పెట్టుకోవడం మామూలే. కానీ ఈ హీరోకు ఏమాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. కామన్ డీపీ పెట్టుకోమని సోషల్ మీడియాలో పిలుపు ఇచ్చేంత సీన్ ఉందా అన్నది డౌటు.

ఇక ఈ హీరో జన్మదిన వేడుకలంటూ చేసిన హంగామా చూస్తే షాకవ్వాల్సిందే. రాజకీయ సభలకు జనాల్ని తీసుకొచ్చినట్లుగా కొంతమందిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం.. హీరో వచ్చి కేక్ కట్ చేసి ప్రసంగించడం.. వాళ్లు కేరింతలు కొట్టడం.. దీనికి సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పెట్టడం.. అబ్బో చాలా హడావుడే చేశారులెండి. ఇదండీ.. ఇంతకుముందులా అవకాశాలు లేక కెరీరే ముగిసిపోయే స్థితిలో ఉన్న హీరో అండ్ కో చేసిన హంగామా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు