ఎట్టకేలకు హిట్టు కొట్టేలా ఉన్నాడే..

ఎట్టకేలకు హిట్టు కొట్టేలా ఉన్నాడే..

అక్కినేని ఫ్యామిలీ బ్యాకప్‌తో హీరోగా పరిచయమైన నాగార్జున మేనల్లుడు సుశాంత్.. ఇప్పటిదాకా ఓ మోస్తరు విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. దశాబ్దం నుంచి పోరాడుతున్నా ఫలితం లేకపోయింది. సొంత బేనర్లో ‘కాళిదాసు’ చిత్రంతో హీరోగా పరిచయమైన ఈ కుర్రాడు.. ఆ తర్వాత ‘కరెంట్’.. ‘అడ్డా’.. ‘ఆటాడుకుందాం రా’ సినిమాలతో పలకరించాడు. కానీ అన్నీ నిరాశకే గురి చేశాయి.

‘ఆటాడుకుందాం రా’ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సుశాంత్.. చాలా కాలం తర్వాత మళ్లీ ఓ సినిమా చేశాడు. అదే.. చి ల సౌ. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రమిది. సొంత బేనర్లో వరుసగా ఎదురు దెబ్బలు తిన్న సుశాంత్ తొలిసారిగా బయటి సంస్థలో చేసిన చిత్రమిది. సుశాంత్ ట్రాక్ రికార్డు దృష్ట్యా దీనికి పెద్దగా బజ్ కనిపించలేదు.

కానీ అంచనాలకు భిన్నంగా ‘చి ల సౌ’ టీజర్ ఆకట్టుకుంది. నిన్నే రిలీజైన ఈ టీజర్ టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది. పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటూ ఓ కుర్రాడిని అతడి కుటుంబ సభ్యులతో పాటు సమాజమంతా పట్టి పీడించే నేపథ్యంలో నడిచే కథ ఇది. ఏమో అనుకున్నాం కానీ.. రాహుల్ రవీంద్రన్‌కు ఈ తరం ప్రేక్షకుల అభిరుచి బాగానే తెలిసినట్లుగా కనిపిస్తోంది. ఫన్ వర్కవుట్ చేయడంలో అతను బాగానే విజయవంతం అయినట్లుగా కనిపిస్తున్నాడు.

సినిమా అంతటా ఎలా టాలెంట్ చూపిస్తాడో కానీ.. ఆసక్తికర టీజర్ కట్ చేసి ఈ సినిమాపై ఆసక్తి రేకెత్తించడంలో మాత్రం అతను సక్సెస్ అయ్యాడు. మరి సుశాంత్‌కు ఇతనైనా సక్సెస్ అందిస్తాడేమో చూడాలి. ఈ చిత్రానికి రాహుల్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చుకోవడంతో పాటు మాటలు కూడా తనే రాయడం విశేషం. రుహాని కథానాయికగా పరిచయం కానున్న ఈ చిత్రాన్ని జశ్వంత్ నడిపల్లి అనే కొత్త నిర్మాత ప్రొడ్యూస్ చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు