భరత్ బాబు ఎక్కడ ఆగుతాడు?

భరత్ బాబు ఎక్కడ ఆగుతాడు?

బ్లాక్ బస్టర్ ప్రామిస్.. బ్లాక్ బస్టర్ ప్రామిస్ అంటూ ‘భరత్ అనే నేను’ గురించి ఘనంగా ప్రకటనలు ఇచ్చాడు నిర్మాత. నిజానికి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ఏమీ కాలేదు. వచ్చిన టాక్‌కు తగ్గట్లుగా వసూళ్లు లేకపోవడంతో చివరికి యావరేజ్ ముద్రతో బాక్సాఫీస్ రేసు నుంచి నిష్క్రమించేలా కనిపిస్తోంది. రూ.100 కోట్ల షేర్ సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ సాధించే స్థితిలో ఈ చిత్రం రెండు వారాల్లో రూ.88 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. గత వీకెండ్లో విడుదలైన ‘నా పేరు సూర్య’కు పాజిటివ్ టాక్ వస్తే రూ.90 కోట్ల షేర్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఆ చిత్రానికి డివైడ్ టాక్ రావడం దీనికి కలిసొచ్చింది. వీకెండ్లో ఓ మోస్తరు వసూళ్లతో షేర్ రూ.93 కోట్లను దాటింది. ఈ చిత్రం బయ్యర్లకు నష్టాలు మిగల్చబోవడం ఖాయం. కాకపోతే అవి స్వల్ప స్థాయిలోనే ఉండే అవకాశముంది.

మహేష్ బాబు గత సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అతడి ప్రతి చిత్రానికీ బిజినెస్ పెరిగిపోతుంటుంది. ‘భరత్ అనే నేను’ విషయంలోనూ అదే జరిగింది. ‘బ్రహ్మోత్సవం’.. ‘స్పైడర్’ డిజాస్టర్లయినప్పటికీ ‘భరత్’కు మహేష్ కెరీర్లోనే అత్యధికంగా బిజినెస్ జరిగింది. కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే రూ.100 కోట్లు పలకడం విశేషం. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వంద కోట్ల షేర్ పెద్ద కష్టమేమీ కాదని.. ‘రంగస్థలం’ వసూళ్లను కూడా దాటేసి నాన్-బాహుబలి రికార్డును కూడా నెలకొల్పుతుందని అనుకున్నారు. కానీ ఆ అంచనాలు ఫలించలేదు.

‘శ్రీమంతుడు’ను దాటి మహేష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అయింది కానీ.. ‘భరత్ అనే నేను’ విషయంలో అంతకుమించి సంతోషించడానికి ఏమీ లేకపోయింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.95 కోట్ల షేర్‌తో సరిపెట్టుకోవాల్సి రావచ్చు. అంటే రూ.5 కోట్ల నష్టం తప్పదన్నమాట. ఓవర్సీస్ లో సైతం ఈ చిత్రానికి నష్టం తప్పేట్లు లేదు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే 3.6 మిలియన్ల దాకా వసూళ్లు రాబట్టాలి. ఇప్పటిదాకా అక్కడ ‘భరత్ అనే నేను’ 3.35 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ‘రంగస్థలం’ సాధించిన 3.5 మిలియన్ మార్కును కూడా ఈ సినిమా అందుకోలేకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు