‘రంగస్థలం’ టీం మళ్లీ అన్యాయం చేసింది

‘రంగస్థలం’ టీం మళ్లీ అన్యాయం చేసింది

‘రంగస్థలం’ సినిమా కోసం శివనాగులు అనే జానపద కళాకారుడితో ‘ఈ గట్టునుంటావా నాగన్నా’ అంటూ ఒక మంచి పాట పాడించాడు దేవిశ్రీ ప్రసాద్. ఫోక్ స్టయిల్లో సాగే ఈ పాట ఆడియోలో బాగానే ఆకట్టుకుంది. కానీ ఆశ్చర్యకరంగా సినిమాలో శివనాగులు గొంతు వినిపించలేదు. దేవిశ్రీ పాడిన వేరే వెర్షన్‌తో రీప్లేస్ చేసేశారు. ఇది చాలామందిని నిరాశ పరిచింది.

ఏమంత ప్రత్యేకత లేని దేవిశ్రీ గొంతుతో ఈ పాట విని పెదవి విరిచారు జనాలు. ఇక ఆ పాట పాడిన శివనాగులు పరిస్థితేంటో చెప్పేదేముంది? పాపం ఇంత పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందని సంబరపడ్డ అతను.. సినిమాలో తన గొంతు వినిపించకపోయేసరికి చాలా బాధపడ్డాడు. కనీసం తనకు ఈ విషయంలో సమాచారం కూడా ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.

ఐతే సినిమాలో చరణ్ గొంతుకు శివనాగులు వాయిస్ సెట్టవదన్న ఉద్దేశంతో ఇలా మార్చాల్సి వచ్చినట్లు చెప్పింది చిత్ర బృందం. అప్పటికి ఆ వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు ‘రంగస్థలం’ నిర్మాతలు ఆ గట్టునుంటావా నాగన్నా పాట ఫుల్ వీడియోను యూట్యూబ‌్‌లో రిలీజ్ చేశారు. ఇందులోనూ దేవిశ్రీ వాయిసే వినిపించింది. సినిమాలో ఎలా చేసినా.. కనీసం యూట్యూబ్ వరకైనా శివనాగులు వెర్షన్ పెట్టి రిలీజ్ చేసి ఉండొచ్చు కదా అని జనాలు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ అతడికి అన్యాయం చేశారే అంటున్నారు.

ఈ పాట లింక్ కింద ట్విట్టర్లో.. యూట్యూబ్‌లో  కామెంట్లు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఇది పెద్ద కష్టమైన పని కూడా కాదు. దేవిశ్రీ వెర్షన్ విషయంలో అన్ని విమర్శలు వచ్చినా.. మళ్లీ యూట్యూబ్‌కు కూడా అతడి వెర్షనే వదలడంలో ఆంతర్యమేంటో? ఈ విషయంలో చాలామంది దేవిశ్రీని తప్పుబడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు