ఎవెంజర్స్ అయింది.. ఇక ఆ సినిమా వస్తోంది

ఎవెంజర్స్ అయింది.. ఇక ఆ సినిమా వస్తోంది

ఇండియన్ బాక్సాఫీస్ మీద భారీ స్థాయిలో దాడి చేసింది ‘ఎవెంజర్స్: ది ఇన్ఫినిటీ వార్’ సినిమా. ఇప్పటిదాకా ఇండియాలో ఏ హాలీవుడ్ సినిమా లేనంత భారీగా విడుదలైన ఈ చిత్రం అందుకు తగ్గట్లే వసూళ్లు కూడా సాధించింది. తొలి రోజే రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఈ ఏడాది హిందీ సినిమాల కంటే ఎక్కువ ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. వీకెండ్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి.. రూ.200 కోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది. ఫుల్ రన్లో ఈ చిత్రం ఇండియాలో అన్ని హాలీవుడ్ సినిమాల రికార్డుల్నీ బద్దలు కొట్టేస్తుందని భావిస్తున్నారు. ఇంకో రెండు మూడు వీకెండ్ల పాటు ఈ చిత్రం హవా నడిచే అవకాశముంది. ఐతే ఈ చిత్ర బాక్సాఫీస్ రన్ ముగిసే సమయానికే మరో హాలీవుడ్ సినిమా ప్రభంజనం మొదలుకాబోతోంది.

జురాసిక్ పార్క్ సిరీస్‌లో భాగంగా రాబోతున్న ‘జురాసిక్ వరల్డ్: ఫాలెన్ కింగ్‌డమ్’ జూన్ 8న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది ఇండియాలో. దేశవ్యాప్తంగా 2500 దాకా స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఎవెంజర్స్ కంటే భారీగానే ఉండబోతోంది రిలీజ్. ‘జురాసిక్ పార్క్’ సిరీస్‌కు మన ప్రేక్షకుల్లో మాంచి క్రేజ్ ఉంది. ‘ఎవెంజర్స్’ తరహాలోనే దీన్ని కూడా హాలీవుడ్లో కంటే ముందు ఇండియాలో రిలీజ్ చేయబోతుండటం విశేషం. ఇప్పటికే దీని ట్రైలర్లు అబ్బురపరిచాయి. ఔరా అనిపించాయి. సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. కాబట్టి ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయం. ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు ఉంటే ‘ఎవెంజర్స్’ రికార్డుల్ని బద్దలు కొట్టే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు