కళ్యాణ్‌ రామ్‌ను భయపెట్టిన కెమెరామన్

కళ్యాణ్‌ రామ్‌ను భయపెట్టిన కెమెరామన్

‘180’ లాంటి క్లాస్ లవ్ స్టోరీ తీసిన జయేంద్ర దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తాడని.. ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ లాంటి మేటి సినిమాటోగ్రాఫర్ ఛాయాగ్రహణం అందిస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఈ కాంబినేషనే చాలా చిత్రంగా అనిపించింది. ఇది తనకు కూడా నమ్మశక్యం కాని విషయమే అంటున్నాడు కళ్యాణ్ రామ్. ముఖ్యంగా పి.సి.శ్రీరామ్ తన సినిమాకు ఛాయాగ్రహణం అందించడం అన్నది పెద్ద షాక్ అని.. ఆయనతో పని చేయాలన్న కల ఇలా నెరవేరుతుందని అనుకోలేదని చెప్పాడు. శ్రీరామ్ ముందు నటించడానికి తానెంతగానో భయపడినట్లు అతను తెలిపాడు.

‘‘ నిర్మాతల్లో ఒకరైన మహేష్‌ వచ్చి మొదట జయేంద్ర కథ చెబుతారంట అన్నారు. ఆయన తీసేది ప్రేమకథలు, నేనేమో మాస్‌ కథలు చేస్తుంటాను కదా అన్నా. అంతలోనే పి.సి.శ్రీరామ్‌ ఛాయగ్రాహకుడని చెప్పారు. ఆ మాట విన్నాక ఇది కలా నిజమా అనిపించింది. దర్శకుడు ఈ కథ చెప్పాక ‘నేను ఈ సినిమాకి కరెక్టేనా?’ అని అడిగా. వాణిజ్య ప్రధానమైన సినిమాలే చేసిన నువ్వు మాత్రమే ఈ కథకి బాగుంటావని..  నిన్ను కొత్త ఫార్మాట్‌లో చూపించడం మాకొక సవాల్‌ అని చెప్పి ఒప్పించారు. జీవితంలో కొంతమందితో కలిసి పనిచేయాలని కోరుకొంటాం. ‘ఘర్షణ’, ‘గీతాంజలి’ లాంటి సినిమాల్ని చూస్తున్నప్పుడు పి.సి.శ్రీరామ్‌ లాంటి ఓ ఛాయాగ్రాహకుడితో పనిచేసే అవకాశం వస్తే ఎంత బాగుంటుందో అనిపించేది. కానీ ఆ మరుక్షణమే అది కలగానే మిగిలిపోతుందిలే అనుకొనేవాణ్ని. దర్శకుడు జయేంద్ర వల్ల ఆ కల నిజమైంది. తొలి రోజు సెట్‌కి వెళుతున్నప్పుడు కూడా భయపడ్డా. పి.సి.శ్రీరామ్‌ సార్‌కి కోపం వస్తే తిడతారని.. కొడతారని విన్నాను. ఆయన ఈ సినిమాలో నన్ను పూర్తిస్థాయిలో కొత్తగా చూపించారు. మీసం తీసేయడం దగ్గర్నుంచి, కళ్లద్దాలు పెట్టడం వరకు అన్నీ ఆయన ఆలోచనలే’’ అని కళ్యాణ్ రామ్ చెప్పాడు.
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు