కన్ఫమ్.. వెంకీకి ఆమె.. వరుణ్‌కు ఈమె

కన్ఫమ్.. వెంకీకి ఆమె.. వరుణ్‌కు ఈమె

టాలీవుడ్లో మరో ఆసక్తకిర మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమైంది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్.. యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్‌ల డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘ఎఫ్-2’ పేరుతో ఓ సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇంకో మూడు వారాల్లోనే సెట్స్ మీదికి వెళ్లనుంది.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథానాయికలెవరో అధికారికంగా ప్రకటించారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్లే మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో వెంకీకి జోడీగా నటించనుంది. తమన్నా వెంకీ ఏజ్ గ్రూప్ హీరోలు ఎవరితోనూ ఇంతదాకా నటించలేదు. గత కొన్నేళ్లలో తమన్నా ఊపు బాగా తగ్గిపోయిన నేపథ్యంలో వెంకీ లాంటి సీనియర్ సరసన నటించడానికి ఒప్పుకోవడం ఆసక్తి రేకెత్తించే విషయమే.

ఇక ఈ చిత్రంలో వరుణ్ సరసన మెహ్రీన్ కౌర్ నటించబోతోంది. హ్యాట్రిక్ హిట్లతో ఊపుమీద కనిపించిన మెహ్రీన్.. ‘కేరాఫ్ సూర్య’.. ‘జవాన్’ లాంటి ఫ్లాపులతో కొంచెం వెనుకబడింది. ఆమె ప్రస్తుతం గోపీచంద్‌తో ‘పంతం’ సినిమా చేస్తోంది. వెంకీ-వరుణ్ ఈ సినిమా చేస్తూనే సమాంతరంగా వేరే చిత్రాల్లో నటించబోతున్నారు. తేజ దర్శకత్వంలో ఆగిపోయిందనుకున్న ప్రాజెక్టును మళ్లీ మొదలుపెట్టబోతున్నాడు వెంకీ.

ఇక వరుణ్ ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ ఫిలింను ఈ నెలలోనే మొదలుపెట్టనున్నాడు. వెంకీ-వరుణ్ కలిసి చేయబోయే ‘ఎఫ్-2’ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ అని సమాచారం. అనిల్‌తో దిల్ రాజు వరుసగా నిర్మిస్తున్న మూడో చిత్రమిది కావడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు