ఒలింపిక్స్‌లో ఇండియా క్లైమాక్స్ అదిరిపోతుందా?

ఒలింపిక్స్ వస్తే పతకం కోసం రోజూ ఎదురు చూడటం భారత క్రీడాభిమానులకు అలవాటే. కొన్ని రోజులు గడిచాక కానీ భారత్ పతకాల పట్టిక ఎక్కదు. ఐదేళ్ల కిందట రియో ఒలింపిక్స్‌లో అయితే నిరీక్షణ సుదీర్ఘంగా సాగింది. ఒలింపిక్స్ ఆరంభమైన పది రోజులకు కానీ పతకం దక్కలేదు. అప్పుడు ఒకే రోజు రెండు పతకాలు దక్కాయి. దానికి ముందు, తర్వాత పతకాలే లేవు. కేవలం రెండు పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఐతే ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు అదిరే ఆరంభం లభించింది. పతక పోటీల తొలి రోజే వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం నెగ్గి అబ్బురపరిచింది. ఇక భారత్‌కు తిరుగులేదని.. పతకాల పంటే అని భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ వరుసగా వైఫల్యాలు ఎదురయ్యాయి. తర్వాతి ఐదు రోజుల్లో ఒక్క పతకం కూడా లేదు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న షూటర్లు తీవ్ర నిరాశకు గురి చేశారు. ఆర్చరీ, బాక్సింగ్, ఇతర ఈవెంట్లలోనూ చేదు అనుభవాలు తప్పలేదు.

ఐతే ఒలింపిక్స్ మధ్యలోకి వచ్చేసరికి నెమ్మదిగా కథ మారుతోంది. భారత క్రీడాకారులు ఆశాజనక ప్రదర్శన చేస్తున్నారు. ఒక్కొక్కరుగా పతకాల రేసులోకి వస్తున్నారు. రియోలో రజతం గెలిచి, ఈసారి స్వర్ణంపై గురి పెట్టిన పి.వి.సింధు.. ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించిన సింధు.. గురువారం మరో విజయంతో క్వార్టర్స్‌లో అడుగు పెట్టింది.
ఇంకో విజయం సాధిస్తే ఆమె సెమీస్ చేరుతుంది. అందులో గెలిస్తే పతకం పక్కా. ఓడినా కాంస్యం కోసం పోరాడటానికి అవకాశముంటుంది.

సింధు ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఆమె కచ్చితంగా పతకం గెలిచేలాగే కనిపిస్తోంది. అన్నీ కలిసొస్తే స్వర్ణమే గెలవొచ్చేమో. ఇక షూటింగ్‌లో ఇప్పటిదాకా పాల్గొన్న ఈవెంట్లలో తీవ్ర నిరాశకు గురి చేసిన మను బాకర్.. తాజాగా 25 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో ఫైనల్‌కు అర్హత సాధించింది. శుక్రవారం ఫైనల్ జరగనుంది.

మరోవైపు బాక్సర్లు లవ్లీనా, పూజా రాణి క్వార్టర్స్ చేరారు. వాళ్లు మరో విజయం సాధిస్తే పతకం ఖాయం. ఆర్చర్ దీపికా కుమారి ప్రిక్వార్టర్స్ చేరింది. ఆమె కూడా పతకంపై ఆశలు రేపుతోంది. ఇంకా అమిత్ ఫంగాల్, మేరీకోమ్ లాంటి అగ్రశ్రేణి బాక్సర్లు ఆశలు రేపుతున్నారు. పురుషుల హాకీ జట్టు క్వార్టర్స్ బెర్తు ఖాయం చేసుకుంది.

ఇక పతకాలకు మంచి ఛాన్సున్న రెజ్లింగ్ పోటీలు ఆరంభం కావాల్సి ఉంది. బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ లాంటి అగ్రశ్రేణి రెజ్లర్లు పోటీకి సై అంటున్నారు. చూస్తుంటే ఒలింపిక్స్ రెండో అర్ధంలో భారత్‌కు పరిస్థితులు ఎంతో ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. మరి వచ్చే వారంలో మన వాళ్లు వీలైనన్ని ఎక్కువ పతకాలు గెలిచి క్లైమాక్స్ అదిరిపోయేలా చేస్తారేమో చూడాలి.